దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ పోలీసులు భూ కబ్జాదారులను వేటాడే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ జంగిలి సాగర్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. లింగారెడ్డి అనే ఉపాద్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన పోలీసులు అతని కోసం వేట కొనసాగించారు. దాదాపు మూడు రోజులుగా పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకుని తిరుగుతున్న జంగిలి సాగర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే జంగిలి సాగర్ భూ దందాలపై పలు ఫిర్యాదులు అందడంతో అన్ని కేసుల్లోనూ విచారణ జరిపించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. లింగారెడ్డి కరీంనగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పటు వీడియో ఫుటేజీని కూడా పోలీసులకు అప్పగించారు. ఇందులో లింగారెడ్డికి పూర్వీకుల నుండి సంక్రమించిన భూమి విషయంలో తనకు రూ. 40 లక్షలు ఇవ్వాలని జంగిలి సాగర్ డిమాండ్ చేశారు. అయితే అంత మొత్తం ఇచ్చుకోలేనని చెప్పి వేడుకున్నా వినిపించుకోకుండా లింగారెడ్డికి సంబంధించిన భూమిలోంచి రోడ్డును వేయించిన సాగర్ రూ. 10 లక్షలు వసూలు చేశాడు. ప్రజా ప్రతినిధిగా ఎన్నికై తనకు మామూళ్లు ఇవ్వనట్టయితే భూముల నుండి రోడ్లు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా వీడియోలో రికార్డు అయింది. తనకు డబ్బులు ఇచ్చే విషయాన్ని కూడా ఆ వీడియోలో మాట్లాడిన సాగర్ తన కూతురు అకౌంట్ కు కొంత డబ్బులు బదిలీ చేయించుకోవడం గమనార్హం.
బాధితులెందరో…
తన ఇలాకాలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరిని ముప్పు తిప్పలు పెట్టిన చరిత్ర ఈ కార్పోరేటర్ కే దక్కుతుంది. గతంలో తన పార్టీకి చెందిన సహచర కార్పోరేటర్, తన సమీప బంధువు కూడా అయినా కూడా వదిలిపెట్టకుండా ఏకంగా బుల్డోజర్లను దింపి కూల్చివేయించిన సంఘటన సంచలనంగా మారింది. అప్పట్లో ఈ అంశంపై మీడియా వెంటపడి రాసినా కూడా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని ముందస్తు బెయిల్ తీసుకుని వచ్చారు. అధికార పార్టీ ముఖ్య నేతల అండదండలు కూడా ఉండడంతో సాగర్ ఏం చేసినా చెల్లింది అన్న చర్చ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సాగింది. అయితే తాజాగా కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తుండడంతో బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. లింగారెడ్డి ఒక్కరే కాకుండా చాలా మంది కూడా పోలీసులను ఆశ్రయించి సాగర్ అక్రమాల తీరుపై ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తోంది. వీటన్నింటిపైనా విచారణ చేపట్టి ఆధారాలతో సహా కేసులు నమోదు చేసేందుకు కరీంనగర్ పోలీసులు రంగంలోకి దిగారు.
రెండో కార్పోరేటర్…
బీఆర్ఎస్ పార్టీకి భారీ జలక్ పడినట్టయింది. వరసగా ఇద్దరు కార్పోరేటర్లను భూ దందాల విషయంలో కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ పార్టీ నాయకుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా తయారైంది. తమవారిని వెనకేసుకొద్దామంటే ప్రజల్లో మరింత చులకన అవుతామన్న బాధ వెంటాడుతుంటే వారిని కాపాడాలంటే పోలీసులు చుక్కలు చూపించే పరిస్థితి తయారు కావడంతో ముఖ్య నాయకులు అంతా కూడా ఈ అంశంపై కిమ్మనకుండా ఉంటున్నారన్న చర్చ కరీంనగర్ వ్యాప్తంగా సాగుతోంది. అయితే కరీంనగర్ పోలీసులకు అందిన ఫిర్యాదుల్లో మరింతమంది కార్పోరేటర్లు కూడా ఉన్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇదే జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మరింత అభాసుపాలు కావడం ఖాయం.