కార్పోరేటర్లలో అంతర్మథనం… కాంగ్రెస్ గూటికి చేరడంపై చర్చ… ఆ పార్టీ చేర్చుకుంటుందా..?

దిశ దశ, కరీంనగర్:

రీంనగర్ బీఆర్ఎస్ కార్పోరేటర్లలో అంతర్మథనం మొదలైందా..? తమను తాము రక్షించుకోవాలంటే పార్టీ ఫిరాయించాల్సిందేనని భావిస్తున్నారా..? అంతర్గతంగా జరుగుతున్న సమావేశాలు దేనికి సంకేతం..? ఓ వైపున ఫిర్యాదుల పరంపర… మరో వైపున అధికారంలో లేకపోవడంతో సేఫ్ జోన్ లోకి వెళ్లడమే శ్రేయస్కరమని వారు భావిస్తున్నారా..?  కరీంనగర్ బల్దియాలోఇప్పుడిదే టాపిక్  సాగుతోంది.

కొందరు అలా… 

రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వచ్చే కార్పోరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న కొంతమంది కార్పోరేటర్లు పార్టీ ఫిరాయించాలన్న భావనకు వచ్చి సమీకరణాలు నెరుపుతున్నారు. దాదాపు 15 మంది కార్పోరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. వీరికి సంబంధించిన ప్రతినిధులు కొంతమంది ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి పార్టీ మారే ప్రతిపాదన గురించి చర్చించినట్టు సమాచారం.

మరి కొందరు ఇలా… 

మరి కొంతమంది కార్పోరేటర్లు కూడా అంతర్మథనంలో పడినట్టుగా తెలుస్తోంది. భూ దందాలతో పాటు ఇతరాత్ర వ్యవహరాలకు సంబంధించిన కేసుల పరంపరం కొనసాగుతున్న నేపథ్యంలో అధికార పార్టీలోకి జంప్ అయితే సేఫ్ జోన్ లో ఉంటామన్న ఆలోచనతో కొంతమంది కార్పోరేటర్లు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ ఫిరాయించినట్టయితే పోలీసులు కూడా అధికార పార్టీ నాయకులన్న భావనతో చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తారన్న యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

గంగులకు సరికొత్త తలనొప్పి… 

కరీంనగర్ నుండి బౌండరి విక్టరీ సాధించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కు కార్పోరేటర్ల రూపంలో సమస్యలు వెంటాడుతున్నట్టుగానే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కినుక వహించిన కార్పోరేటర్లను బుజ్జగించాల్సి వచ్చిన సందర్భాలు చాలా సార్లు ఎదుర్కొన్నారన్న ప్రచారం పార్టీలో ఉంది. చావు తప్పి కన్ను లొట్ట బోయినట్టుగా బోటాబోటి మెజార్టీతో గెలుపును అందుకున్న గంగుల గెలిచినా తరువాత కూడా అదే కార్పోరేటర్ల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టుగా సమీకరణాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా డివిజన్లలో కార్పోరేటర్లను కాదని ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని పెంచి పోషించడం కొంతమందికి మింగుడు పడకుండా తయారైంది. ఈ కారణంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు చేసిన తప్పిదాలు తమ మెడకు చుట్టుకోకముందే దూరంగా వెల్లడం బెటర్ అని అనుకుంటున్న వారూ లేకపోలేదు. దీంతో ఎన్నికలు ముగిసినా గంగులకు మాత్రం కార్పోరేటర్ల రూపంలో ఇబ్బందులు ఎదురుకాక తప్పడం లేదు. మరో వైపున మేయర్ సునీల్ రావు కూడా కార్పోరేటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. గురువారం హుటాహుటిన సమావేశం ఏర్పాటు చేయగా 8 మంది కార్పోరేటర్లు హజరయినట్టు సమాచారం. అయితే మిగతా కార్పోరేటర్లతో ఈ రోజు ప్రత్యేకంగా ఓ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో కరీంనగర్ బల్దియా బీఆర్ఎస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. 

You cannot copy content of this page