రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం.. కేసీఆర్ దిశానిర్దేశం

దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌ను విస్తరించే లక్ష్యంతో పార్టీ అధినేత కేసీఆర్ ఆ దిశగా చర్యలను వేగవంతం చేశారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించగా.. మరికొన్ని రాష్ట్రాలకు చెందిన నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలపేతం చేసే అంశంపై కేసీఆర్‌ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. కాగా, రేపు మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్​ఎస్​ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశం కానుంది.

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్యవర్గ సభ్యులతో పాటు జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ ఛైర్మన్లు హాజరుకావాలని సమాచారం పంపించారు. ఎన్నికల ఏడాది కావడంతో పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనే విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఎలా ఉంది, వాటిని ప్రజల్లో విస్తృతంగా ఎలా తీసుకెళ్లాలి.. రానున్న రోజల్లో పార్టీపరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు.

బీఆర్ఎస్ నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కేసీఆర్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండించే అవకాశం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల తీరు.. జాతీయస్థాయిలో పార్టీ విస్తరణ వంటి కీలక అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. దీనికి సమాధానంగా కవిత ఈనెల 10వ తేదీన పార్లమెంటులో ఎప్పటినుంచో పెండింగ్‌​లో ఉన్న మహిళా రిజర్వేషన్​ బిల్లు విషయంలో జంతర్ ​మంతర్​ దగ్గర ధర్నా నిర్వహించనున్నారు. అందువల్ల తాను ఈ నెల 11 తర్వాత విచారణకు హాజరవుతానని.. ఈడీకి లేఖ రాశారు. కాగా, దీనిపై ఈడీ స్పందించింది. ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

You cannot copy content of this page