దిశ దశ, హైదరాబాద్:
ట్విట్టర్ వేదికగా ఆహ్వానానికి స్పందించి అభిమానికి ఇంటికి వెళ్లారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్. దివ్యాంగులైన తన పిల్లలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని సదరు వ్యక్తి అభ్యర్థించడంతో అతనికి లబ్ది చేకూర్చారు కేటీఆర్. జనవరి 2న బోరబండకు చెందిన ఇబ్రహీం ఖాన్ తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని అభ్యర్థించాడు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేటీఆర్ ఆదివారం సాయంత్రం ఇబ్రహీంఖాన్ ఇంటికి వెళ్లారు. గాజుల దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన ఇంటికి వెల్లి కుటుంబ సభ్యుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇబ్రహీంఖాన్ పిల్లల అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు అవసరమైన సహకారం అందిస్తానన్నారు. సాధారణ వ్యక్తి అతిథ్యం కోసం ఆహ్వానించడం తనకు సంతోషాన్నిచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అందించిన సేవలకు గుర్తింపుగా తనను ఇంటికి పిలవడం చిరస్మరణీయమన్నారు.