దిశ దశ, హుజురాబాద్ కరస్పాండెంట్:
హుజురాబాద్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు గులాభి జెండాలతో కనిపించిన ఆ భవనం ఇప్పుడు కాంగ్రెస్ ఆఫీసుగా మారిపోయింది. వొడితెల కుటుంబంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో భవనం తాలూకు రంగులు కూడా మారిపోవడం స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది.
2001 నుండి…
తెలంగాణ ఆవిర్భావం కోసం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటయిన తరువాత కాంగ్రెస్ పార్టీ తరుపున సేవలందించిన ఆ భవనం గులాభి శ్రేణుల కార్యకలాపాలకు వేదికగా మారింది. 2001 నుండి నిన్న మొన్నటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల కార్యకలాపాలు కూడా ఈ బిల్డింగ్ నుండే కొనసాగించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వొడితెల ఫ్యామిలీకి చెందిన వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీతో అనుబంధం పెట్టుకోవడంతో ఈ భవనం కూడా ఆ పార్టీ ఆఫీసుగా మారిపోయింది. తాజాగా గత శుక్రవారం మాజీ ఎంపీ దివంగత రాజేశ్వర్ రావు మనవడు ప్రణవ్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ రాజేశ్వర్ రావు వారసులు మాత్రం పూర్వాశ్రమం వైపు అడుగులు వేశారు. ఇందులో భాగంగానే ప్రణవ్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరి హుజురాబాద్ నుండి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆఫీసు భవనానికి రెండు మూడు రోజుల క్రితమే తాళం వేయించి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా వాల్ రైటింగ్స్ చేయించారు. ఇక నుండి ఈ భవనంలో హుజురాబాద్ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తామని కూడా ప్రణవ్ బాబు సన్నిహితులు చెప్తున్నారు. ఆయన కూడా ఈ ఆఫీసు భవనం నుండే రాజకీయ వ్యవహారాలను చక్కదిద్దేందుకు సమాయత్తం అవుతున్నారు.
అధికార పార్టీ…?
అయితే 22 ఏళ్లుగా గులాభి శ్రేణులకు షెల్టర్ ఇచ్చిన పార్టీ కార్యాలయ భవనం పార్టీ మారడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ ఆఫీసు ఏర్పాటు చేసుకోవల్సిన అవసరం ఏర్పడింది. హుజురాబాద్ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు కొనసాగించేందుకు కొత్త భవనం చూసుకోవల్సిన ఆవశ్యకత ఏర్పడింది.