దిశ దశ, మంచిర్యాల:
మంచిర్యాల జిల్లాలో సంచలన ఘటన జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ ఏకంగా ఏసీపీ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనల స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని నస్పూర్ ఏసీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ బేర సత్యనారాయణ తన గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఏసీపీ కార్యాలయంలోనే ఆయన సూసైడ్ అటెమ్ట్ కు పాల్పడడంతో పోలీసు అధికారులు, సిబ్బంది హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీసీ నస్పూర్ మునిసిపాలిటీ సిబ్బంది విధులకు ఆటంకం కల్గించారని, కులం పేరుతో దూషించారని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసు అధికారులు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నప్పుడు ఆయన ఈ ఘటనకు పాల్పడినట్టుగా సమాచారం. అయితే పోలీసు అధికారులు మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఆధారాలేవి: సత్యనారాయణ ఫ్యామిలీ
మంచిర్యాల జిల్లా కేంద్రంలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఏమైనా అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 25 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సత్యనారాయణ ఏనాడూ వివాదాల్లోకి వెల్లలేదని, పదేళ్లు అధికారంలో ఉన్న వేరే పార్టీ నాయకులను హించించలేదన్నారు. అటువంటి వ్యక్తిపై తప్పుడు ఫిర్యాదులు చేయించి కేసుల్లో ఇరికించారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కావాలనే ఇదంతా చేయిస్తున్నారని, ఆయన ప్రోద్భలంతోనే వేధింపులకు గురి చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. తమకు కూడా వెన్నుదన్నుగా ముఖ్యమైన వారు ఉన్నారని వారి అండతో తాము కూడా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. భూ సంబంధిత అంశంలో సత్యనారాయణ జోక్యం చేసుకున్నారని అంటున్న అధికారులు ఇందుకు తగిన సాక్ష్యాలను కూడా చూపించాలని సవాల్ విసిరారు. సీసీ ఫుటేజీ కాని, వీడియో రికార్డులు కానీ, కనీసం ఆడియో రికార్డు ఉన్నా బయటపెట్టాలన్నారు.