Brs Party: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం, పార్టీని దేశ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ పర్యటనను వేదికగా మార్చుకుంన్నారు. గత మూడు రోజులుగా ఢిల్లీలోనే కేసీఆర్ మకాం వేశారు. బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంపై మేధావులు, మీడియా అధిపతులు, రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ అధికారులు, మాజీ ఆర్మీ అధికారులు, రైతు, దళిత సంఘాలతో కీలక చర్చలు జరుపుతున్నారు. దేశంలో రాజకీయంగా మార్పులు తీసుకొచ్చేందుకు వారి వద్ద నుంచి పలు కీలక సూచనలను స్వీకరిస్తున్నారు. మరోవైపు దేశంలో బీఆర్ఎస్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలనే దానిపై పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు.
ఇందుకోసం ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత కేసీఆర్ ఎలాంటి ఆవిర్భావ సభ ఏర్పాటు చేయలేదు. దీంతో ఢిల్లీ గడ్డపై బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 9న సభ నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సభ ద్వారా దేశ ప్రజలకు బీఆర్ఎస్ ఏర్పాటు గురించి తెలియజేనున్నారనే టాక్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ సభ ఏర్పాట్లపై ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో సభ నిర్వహించాలని కేసీఆర్ ఆలోచించినట్లు తెలుస్తోంది. దేశం నలుమూలల నుంచి ప్రజలను ఈ సభకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. రైతు, దళిత సంఘాల నేతలను ఈ సభకు ఆహ్వానించే అవకాశముంది. దేశం దృష్టిని ఆకర్షించేలా ఈ సభకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ర్యాలీగా కేసీఆర్ వెళ్లడం బాగా ప్రభావం చూపింది. ఇప్పుడు కూడా అదే తరహాలో వెళ్లేలా కసరత్తులు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. జాతీయ మీడియా, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేలా సభ ఉంటుందని చెబుతున్నారు.
అదే విధంగా ఈ బహిరంగ సభలో పలు పార్టీలు, రైతు, దళిత సంఘాలు బీఆర్ఎస్‌లో విలీనం అయ్యేలా ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఈ సభకు భారీగా జనాలను సమీకరించి ఢిల్లీ గడ్డపై బీఆర్ఎస్ సత్తా చూపించేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఒకరకంగా ఈ సభ ద్వారా బలప్రదర్శనకు కేసీఆర్ దిగబోతున్నారనే చర్చ జరుగుతోంది. వివిధ జాతీయ పార్టీల నేతలను కూడా ఈ సభకు ఆహ్వానించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.