దిశ దశ, హైదరాబాద్:
నదీనాం సాగరో గతి: అన్నట్టుగా మారిపోయింది తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు. నదులన్ని చివరకు సముద్రంలోనే కలుస్తాయన్న రీతిలో సాగుతున్నాయి ఇక్కడి పాలిట్రిక్స్. ఉద్దండులుగా పేరు గాంచిన నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకే ఆసక్తి చూపుతుండడంతో భారత రాష్ట్ర సమితి మాత్రం చాలా వైవిద్యమైన రికార్డును అందుకుంది. తలపండిన నేతలుగా పేరు పడ్డ వారు కూడా కేసీఆర్ పంచన చేరుతుండడమే ఇందుకు కారణం.
పీసీసీ అధ్యక్షులు…
కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన ముగ్గురు సీనియర్ నేతలు గులాభి కండువా కప్పుకోవడం విశేషం. ఉద్యమ ప్రస్థానంలో కె కేశవ రావు, ఆ తరువాత ధర్మపురి శ్రీనివాస్, ఇటీవలే చేరిన పొన్నాల లక్ష్మయ్య ముగ్గురు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారే కావడం విశేషం. వీరిలో ధర్మపురి శ్రీనివాస్ కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉండగా ఇటీవలే అనారోగ్య సమస్యలు ఎదుర్కొవడంతో ఆయన రెస్ట్ లో ఉన్నారు. కె కేశవరావు, పొన్నల లక్ష్మయ్యలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో నిమగ్నం అయ్యారు.
టీడీపీ నుండి…
ఇకపోతే తెలంగాణ ఉద్యమం నుండి ఒడిదొడుకులు ఎదుర్కొన్న టీడీపీ పార్టీ విభజన తరువాత పూర్తిగా వీక్ అయిపోయింది. అయినప్పటికీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలతోనే పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన ఎల్ రమణ ఇప్పటికే 2021 ఉప ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా మరో అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ టీడీపీకి ఇప్పటి వరకు ముగ్గురు అధ్యక్షులుగా వ్యవహరించగా అందులో ఇద్దరు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం.
అరుదైన రికార్డే…
అయితే రెండు జాతీయ పార్టీలకు చెందిన రాష్ట్ర అధ్యక్షులు ఐదుగురు ఉద్యమ పార్టీలో చేరడం కూడా అత్యంత అరుదేనని చెప్పాలి. రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన ఐదుగురు నేతలు కూడా ఒకే పార్టీలో చేరడం విశేషం. ఓ ప్రాంతీయ పార్టీగా ఎదిగి ఇప్పుడిప్పుడు జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న ఉద్యమ పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన రాష్ట్ర అధ్యక్షులు జాయిన్ కావడం గమనార్హం. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఓ రికార్డ్ క్రియేట్ చేసినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయంలో విచిత్రం ఏంటంటే… చిన్న చిన్న నదులన్ని సముద్రంలో కలిసిపోతే… సముద్రమంతా విశాలమైన చరిత్ర, క్యాడర్ ఉన్న పార్టీలకు బాధ్యతలు నిర్వర్తించిన నేతలు ఓ రాష్ట్రానికే పరిమతం అయిన పార్టీలో చేరడం.