దిశ దశ, హైదరాబాద్:
సెంటిమెంట్ల విషయంలో ప్రత్యేకంగా వ్యవహరించే ముఖ్యమంత్రి కేసీఆర్ ను మాత్రం ఓ రెండు అంశాలు మింగుడుపడకుండా చేశాయి. చాలా విషయాల్లో కూడా సెంటిమెంట్లకే ప్రాధాన్యం ఇస్తారన్న అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో కూడా బలంగా నాటుకపోయిందంటే ఆయన అందుకోసం ఇచ్చే ప్రాధాన్యత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఎన్నికల్లో ఓ రెండు సెంటిమెంట్లను బలంగా నమ్ముకున్న గులాభి పార్టీకి మాత్రం ఝలక్ ఇచ్చినట్టే అయింది. రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ వ్యూహ ప్రతి వ్యూహాల్లో తలమునకలయినప్పటికీ రాష్ట్ర ప్రజలు మాత్రం కారుకు బైబై చెప్పేశారు. రాష్ట్రంలో గతంలో ఉన్న సాంప్రాదాయాన్ని అంచనా వేసిన గులాభి శ్రేణులు తెలంగాణ హస్తగతం కాదన్న ధీమాతో వ్యవహరించారు. అయితే ఇదే సమయంలో ఆ పార్టీని మరో సాంప్రాదాయం మాత్రం వెంటపడిందన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణాలో 59 సీట్లకు మించి కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోవడం తమకు లాభిస్తుందని బీఆర్ఎస్ ముఖ్య నేతలు బలంగా నమ్మారు. ఇదే అంచనాతో కాంగ్రెస్ పార్టీ ఈ సారి కూడా అధికారంలోకి రాదని కార్య రంగంలోకి దూకారు. అయితే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికీ పరిస్థితులకు స్వరాష్ట్రంగా ఏర్పడిన తరువాత మారిన పరిస్థితులకు పోలిక ఏంటని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అనుకున్నారు. తెలంగాణాలో నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీపై వచ్చిన సానుకూలత తమకు లాభిస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం కూడా అంచనా వేసింది. అయితే బీఆర్ఎస్ పార్టీ అంచనాలను తలకిందులు చేస్తు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. 60కి పైగా సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు కొనసాగిన ఆనవాయితీకి స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత కొనసాగే విధానానికి పోలిక లేదంటూ చేతల్లోనే చూపించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు.
బీఆర్ఎస్ ను వెంటాడిన ఆ సాంప్రాదాయం…
అయితే బీఆర్ఎస పార్టీని మాత్రం ఓ సాంప్రదాయం అయితే వెంటాడినట్టే కనపడుతోంది. దక్షిణాది రాష్ట్రాలలో మూడో సారి ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదని, ఇక్కడి ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీ వైపే మొగ్గు చూపుతారని గత చరిత్రం తేల్చి చెప్తున్నది. అయితే ఆ రికార్డును బ్రేక్ చేయాలనుకున్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆచరణలో విఫలం అయింది. సౌత్ పబ్లిక్ హ్యాట్రిక్ గవర్నమెంట్ ను ఏర్పాటు చేసేందుకు అధికారపార్టీకి అండగా నిలబడరని మరోసారి రుజువు అయింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఈ సెంటిమెంట్ ను పక్కనపెట్టేసి తమకు కాంగ్రెస్ పార్టీ సాధించిన సీట్ల చుట్టే గణాంకాలు వేసుకుంటూ మరోసారి అధికారంలోకి వస్తామని నమ్మారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడానికే మొగ్గు చూపాడంతో బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్న రెండు సెంటిమెంట్లు కూడా వర్కౌట్ కానట్టేనని స్పష్టం అయింది.