కార్యకర్తలను అక్కున చేర్చుకోండి
దిశ దశ, హైదరాబాద్:
పార్టీకి అత్యంత కీలకమైన కార్యకర్తలతో మమేకమై వారిని అక్కున చేర్చుకునేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జీలు కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయా జిల్లాల అధ్యక్ష్య, కార్యదర్శులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 60 లక్షల మేర ఉన్న పార్టీ శ్రేణులను మరింత చైతన్య పరిచేలా విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టలని నిర్ణయించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు పార్టీ కొన్ని కార్యక్రమాలకు సంబందించిన ప్రణాళికలను స్థూలంగా రూపొందించిందని, ప్రజాప్రతినిధులు వీలయినంత వరకూ ప్రజల్లోనే ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలను రూపొందించినట్టు తెలిపారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టాలని, పార్టీలో పనిచేసే కిందిస్థాయి కార్యకర్త నుండి ఉన్నత నాయకత్వం మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్టు కేటీఆర్ వెల్లడించారు. బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని, ఇందుకు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్ గా తీసుకొని ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టాలని, పట్టణాల్లో ఒక్కో పట్టణానికి, లేదా పట్టణాల్లోని డివిజన్లను కలుపుకుని ఈ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ ఛైర్మన్ లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లతో పాటు బాధ్యతల్లో ఉన్న ప్రతి ఒక్కరు భాగస్వాములు కావలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రెండు నెలల్లోగా ఈ సమ్మేళనాలను పూర్తి చేయాలని, పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి పూర్తయ్యే విధంగా ప్లాన్ చేసుకుని ముందుకు సాగాలని కేటీఆర్ సూచించారు. అలాగే సమ్మేళనాలకు సంబంధించిన షెడ్యూల్ రాష్ట్ర కార్యాలయానికి వెంటనే అందించాలన్నారు. అలాగే జిల్లా పార్టీ కార్యాలయాలు అన్నింటిని ప్రారంభించుకోవాలని ఏప్రిల్ 27 నాటికల్లా పూర్తి కావల్సి ఉందని కేటీఆర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినందున ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించుకోవాలని కేటీఆర్ సూచించారు. ఓ వైపున దేశంలోనే అతిపెద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని మరోవైపున పరిపాలన సౌలభ్యం కోసం నిర్మిస్తున్న నూతన సచివాలయనికి కూడా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టామని, దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించి, విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నామన్నారు. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా బిఆర్ అంబేద్కర్ గారి వారసత్వాన్ని స్ఫూర్తిని ఇంత గొప్పగా గౌరవించుకోలేదన్న విషయాన్ని గమనించాలన్నారు. ప్రభుత్వ, పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆయన జయంతి ఉత్సవాలనురాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జూన్ 2న అమరవీరుల స్థూపం ఆవిష్కరణ నేపథ్యంలో విస్తృతంగా పలు కార్యక్రమాలను చేపట్టాలని, 2023-24 విద్యా సంవత్సరం జూన్ నెల నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలలు చేపట్టాలన్నారు. విద్యార్థి విభాగ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా విస్తృతంగా చేయాలని, నూతన కమిటీలను వేయాలన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్య కళాశాలలలో నూతన విద్యార్థులకు స్వాగత సభల పేరుతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఏప్రిల్ 25 నాడు నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సమావేశాలను ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యాచరణపై ఈ వారంలోనే నేరుగా పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయనున్నామని టెలి కాన్ఫరెన్స్ లో చర్చించుకున్న అంశాలకు సంబందించిన ప్రణాళికలను సిద్దం చేసుకుని రావాలని కేటీఆర్ కోరారు.