ఫ్లెక్సీల చింపివేత
దిశ దశ, జగిత్యాల:
బీజేపీ ఎంపీటీసీ సభ్యుడికి అక్కడి బీఆర్ఎస్ నాయకులు భారీ షాకిచ్చారు. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడేనన్న భావనతో గులాభి కండువా కప్పి ఫెక్సీలో ఫోటో అచ్చు వేయించారు. దీంతో సదరు బీజీపీ ఎంపీటీసీ ఆగ్రహంతో ఊగిపోయి ఫ్లెక్సీలను చింపివేశారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోని మల్యాల మండలం బల్వంతాపూర్ లో శక్రవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటన ఫిక్స్ అయింది. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేకు స్వాగతం చెప్పేందుకు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోటోలను ఫ్లెక్సీల్లో ముద్రించగా స్థానిక ఎంపీటీసీ సభ్యుడు రవిని కూడా బీఆర్ఎస్ నాయకుడేనని భావించిన నాయకులు ఆయన భూజాలపై గులాభి కండువా వేసి మరీ ఫ్లెక్సీని సిద్దం చేశారు. ఈ ఫ్లెక్సీలు బల్వంతాపూర్ లో ఏర్పాటు చేయడంతో తన ఫోటోకు గులాభి కండువా కప్పి ఉన్న విషయం తెలుసుకుని స్థానిక సర్పంచ్ కి అభ్యంతరం వ్యక్తం చేశానని, ఫోటో తొలగించాలని కూడా కోరానని ఎంపీటీసీ రవి అంటున్నారు. అయితే బీఆర్ఎస్ నాయకుల నుండి స్పందన లేకపోవడంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేసి ఫ్లెక్సీలను తొలగించినట్టు వెల్లడించారు. ఐదేళ్ల క్రితమే తాను బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరానని ప్రస్తతం ఎంపీటీసీగా వ్యవహరిస్తున్న తన ఫోటోకు గులాభి కండువా కప్పడం సరికాదని రవి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించిన తీరు అంతటా చర్చనీయాంశంగా మారగా, బీజేపీ నాయకుడు ఎంపీటీసీ రవి మాత్రం అధికార పార్టీ నాయకులపై మండిపడుతున్నారు.