అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్దం.. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీలో నయా పాలిటిక్స్

దిశ దశ, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అవిశ్వాస రాజకీయాల్లో అసమ్మతి నాయకులు పావులు కదుపుతున్నారు. శుక్రవారం అవిశ్వాస నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్దం చేశారు. జిల్లాలోని మెజార్టీ జడ్పీటీసీ సభ్యులు క్యాంపులోకి చేరడంతో సిట్టింగ్ ఛైర్మన్ పుట్ట మధును గద్దె దింపేందుకు కసరత్తులు చేస్తున్నారు.

బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్…

జిల్లాలో అవిశ్వాస రాజకీయాలకు సొంత పార్టీ నాయకులే పావులు కదుపుతుండడం చర్చనీయాంశంగా మారింది. 13 మంది సభ్యులు ఉన్న ఈ జిల్లాలో మెజార్టీ జడ్పీటీసీలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అయినప్పటికీ అవిశ్వాసం పెట్టేందుకు క్యాంపు రాజకీయాలను చేపట్టడం వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ మొదలైంది. జిల్లాలో ప్రత్యర్థి పార్టీలు అత్యంత బలహీనంగా ఉన్నప్పటికీ సొంత పార్టీ నాయకులే జడ్పీ ఛైర్మన్ ను మార్చాలని వ్యూహం రచించినట్టుగా స్పష్టం అవుతోంది. గతంలో పుట్ట మధుకు సాన్నిహిత్యంగా ఉండి గత కొంతకాలంగా దూరంగా ఉన్న వారే అవిశ్వాస రాజకీయాలను నడిపిస్తున్నట్టుగా సమాచారం. వీరే జడ్పీటీసీలందరిని కూడగట్టుకుని క్యాంపునకు తరలించడంలో కీలక భూమిక పోషించినట్టుగా తెలుస్తోంది.

శ్రీధర్ బాబు మద్దతు..? 

అయితే పుట్ట మధుపై అవిశ్వాసం పెట్టే అంశంలో బీఆర్ఎస్ జడ్పీటీసీ సభ్యులను జట్టు కట్టేలా వ్యూహం రచించిన నాయకులకు మంత్రి శ్రీధర్ బాబు అండదండలు ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జిల్లాలోని మంథని నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నశ్రీధర్ బాబుకు పుట్ట మధుకు మధ్య రాజకీయ వైరుధ్యం ఉన్నందున తాము వేసే ఎత్తులకు మంత్రి మద్దతు ఉంటుందని ఆశించారు. ఈ విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ తరువాతే క్యాంపు రాజకీయాలను ప్రారంభించినట్టుగా సమాచారం.

You cannot copy content of this page