వినతి పత్రం తీసుకుని వివరాలడిగిన గంగుల
అవగాహన చేసుకుని ఆందోళన చేస్తే మంచిదని హితవు
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ రూరల్ మండలంలో పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ కాన్వాయిని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. మంగళవారం దుర్శేడు గ్రామంలో వడగండ్ల వాన బీభత్సానికి గురైన పంటలను పరిశీలించేందుకు వెల్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా మంత్రి కాన్వాయికి అడ్డంగా వెల్లాయి. దీంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని గమనించిన మంత్రి కాంగ్రెస్ నాయకులను తన వద్దకు పంపించాలని సూచించగా పోలీసులు వారిని వదిలేశారు. పంట నష్ట పరిహారం గురించి కాంగ్రెస్ నాయకులు మెన్నేని రోహిత్, పద్మాకర్ రెడ్డిలు మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు. మంత్రి గంగుల కమలాకర్ వారిని వివరాలు అడిగినప్పుడు రోహిత్ రావు సరిగా చెప్పలేకపోవడంతో అవగాహన చేసుకున్న తరువాత ఆందోళన చేస్తే బావుంటుందని సూచించారు. అనంతరం గంగుల పంటలను పరిశీలించేందుకు వెల్తున్న క్రమంలో రోహిత్ రావు మీడియాతో మాట్లాడుతూ… తాము మంత్రిని కలిసి విన్నవించేందుకు వెల్తుంటే అడ్డుకున్నారని ఆరోపించారు. పంటల నష్ట పరిహారం విషయంలో బీఆర్ఎస్ నాయకులకు బుద్ది లేదంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు విన్న బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఓ వైపున బీఆర్ఎస్ శ్రేణులు జైజై గంగుల అంటూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు జైజై కాంగ్రెస్ అంటూ పోటాపోటిగా నినాదాలు ఇచ్చుకున్నారు. దీంతో దుర్శేడు గ్రామంలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post