హత్య చేసి… వీడియో తీసి… వేములవాడలో దారుణం

దిశ దశ, వేములవాడ:

రక్తపు మరకలు చూసిండ్రా… బైరెడ్డి అంటే ఏంటిదో… విడిచిపెట్టనంటూ హెచ్చరిస్తూ తీసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ చేతిలో గొడ్డలి పట్టుకుని చూపిస్తూ తీసిన ఈ వీడియో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించినదిగా స్పష్టం అవుతోంది. హత్య చేసిన తరువాత వార్నింగ్ ఇస్తున్నట్టుగా తీసిన ఈ వీడియో స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

హితుడా… శత్రువా..?

వేములవాడలోని నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పరుశురాం (39) ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను బైరెడ్డి అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతకాలంగా పరుశురాం, బైరెడ్డిలు సాన్నిహిత్యంగానే మెదులుతున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే పరుశురాంను ఎందుకు హత్య చేశాడన్న విషయంపై స్పష్టత లేకున్నప్పటికీ బాధితుని కుటుంబ సభ్యులు మాత్రం పాత కక్ష్యలు ఉన్నాయని చెప్తున్నట్టుగా సమాచారం. మృతుడు పరుశురాం వేములవాడ మునిసిపల్ మాజీ వైస్ ఛైర్మన్ బింగి మహేష్ వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మద్యం మత్తులో కోనాయిపల్లికి చెందిన బైరెడ్డి ఫోన్ చేసి రెచ్చగొట్టి… బయటకు తీసుకెళల్ి మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్ వద్ద గొడ్డలితో నరికి చంపివేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సంచలనంగా వీడియో…

హత్య తరువాత బైరెడ్డి తీసిన వీడియో సంచలనంగా మారింది. పరుశురాంను హత్య చేసిన తరువాత రక్తపు మరకలు ఉన్న గొడ్డలిని చూపిస్తూ హెచ్చిరించిన తీరును బట్టి అయితే ఇద్దరి మధ్య విబేధాలు తీవ్ర స్థాయిలో నెలకొని ఉంటాయన్న అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే హత్యకు ముందు వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ కారణంగా అప్పటికప్పుడు ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో మర్డర్ చేసి ఉంటాడా అన్న విషయంపై క్లారిటీ రావల్సి ఉంది. వీడియోను పరిశీలిస్తే మాత్రం ప్రతీకారచర్య తీసుకునేందుకు ముందుగానే పథకం వేసుకుని ఉంటారన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కూడా నేర చరిత ఉన్న బైరెడ్డి పరుశురాం హత్య విషయంలోనూ తన నైజాన్ని ప్రదర్శించి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అనుమానితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అతన్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. బైరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించినట్టయితే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

వారెవరూ..?

బైరెడ్డి తీసిన సెల్ఫీ వీడియోలో మరికొంతమంది కూడా కనిపిస్తున్నారు. పరుశురాం హత్యలో వీరి పాత్ర కూడా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. సెల్ఫీ వీడియోలో ఉన్న వారెవరూ..? వారితో బైరెడ్డికి ఉన్న సంబంధాలు ఏంటీ అన్న వివరాలు కూడా తెలుసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే వేములవాడ పట్టణంలో నేరాలు జరగడం సాధారణమే అయినప్పటికీ హత్య చేసిన తరువాత నిందితులు విడుదల చేసిన వీడియో సంచలనంగా మారిందనే చెప్పాలి. పరుశురాంను హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్నానని బాహాటంగా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. హత్య తరువాత కూడా భయం బెరుకు లేకుండా బైరెడ్డి వ్యవహరించిన తీరుపైనే స్థానికంగా చర్చ సాగుతోంది.

You cannot copy content of this page