దిశ దశ, కరీంనగర్:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడిన వారి భరతం పట్టేందుకు అక్కడి ప్రభుత్వం బుల్డోజర్ లతో ఇండ్లను కూల్చివేసే పనికి పురమాయించింది. పోలీసులే దగ్గరుండి నేరమయ ప్రపంచంతో కాలం వెల్లదీస్తున్న వారిని వెంటాడి వేటాడి పట్టుకోవడంతో పాటు వారి ఇండ్లను కూడా కూల్చారు. దీంతో అక్కడ నేరస్థులు జైళ్లలోకి వెల్తే… మరికొంత మంది ఆ భయంతోనే పొట్ట చేత పట్టుకుని దేశం నలమూలలకు వలస వెళ్లారు. అంతేకాకుండా అక్కడ పూర్వీకుల ఆస్తులు దురక్రామణకు గురయ్యాయని బాధితులు ఫిర్యాదు చేస్తే ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు కావడమే కాదు బాధితులకు బాసటగా నిలిచిన చరిత్ర సృష్టించింది యోగి సర్కార్.
సీన్ కట్ చేస్తే…
దేశంలోనే విశాలంగా విస్తరించిన రాష్ట్రంలో పరిస్థితులు అలా ఉంటే… నూతనంగా ఏర్పడిన తెలంగాణాలో అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం ఏర్పడింది. ఇక్కడ అంతా అక్రమార్కులదే రాజ్యం… అక్రమాలకు పాల్పడే వారికే భోజ్యం అన్న రీతిలో దందాలు కొనసాగాయి. ఒక్క కరీంనగర్ కమిషనరేట్ లో జరిగిన ఘటనలను పరిశీలిస్తేనే భారతీయ శిక్ష్మాస్మృతిని ఎలా చట్టుబడేలా చేశారో అర్థమవుతుంది. ఏండ్లుగా నివాసం ఉంటున్న ఇండ్లే అయినా… శతాబ్దాలుగా వారసత్వంగా వచ్చిన భూములే అయినా చట్ట ప్రకారం మీరే హక్కుదారులైనా… ఏ రాత్రయిన బల్డోజర్లు వచ్చి అక్కడున్న నిర్మాణాలను కూల్చేస్తాయి. కరీంనగర్ లో అమలయ్యే చట్టం ఇలాగే ఉంటుందంతే.. వింటే విను లేకుంటే నీ చావు నువ్వు చావు కానీ మేము మాత్రం ఇలాగే వ్యవహరిస్తామంటూ స్పష్టం చేశాయి నాటి పరిస్థితులు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకుర్తిలో పేదలకు పంచిన భూముల్లో కొన్నేండ్లుగా ఇండ్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు నిరుపేద మైనార్టీ బిడ్డలు. కోర్టు ఉత్తర్వులు వచ్చాయంటూ రాత్రికి రాత్రే వాటిని కూల్చివేసి రచ్చ రచ్చ చేసిన తీరు తెలంగాణ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. కోర్టు ఆదేశాలు ఉన్నట్టయితే అధికారికంగా నోటీసులు ఇచ్చి ఖాలీ చేయాలని సూచించారా..? వారికి కెటాయించిన ఇంటి నంబర్లను రద్దు చేయాలని పంచాయితీ అధికారులకు కోర్టు ఉత్తర్వులు పంపించారా..? ఈ భూమి విషయంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ప్రత్యర్థులు పై కోర్టులో అప్పీల్ చేసేందుకు గడువు ఉన్న విషయాన్ని కూడా విస్మరించి ఇష్టారాజ్యంగా వ్యవహరించారెందుకు..? ఈ వ్యవహారంలో రెవెన్యూ, పోలీసు, పంచాయతి వ్యవస్థ అచేతనావస్థకు చేరిపోవడానికి కారణం ఏంటీ..? ముస్లిం మైనార్టీల ఇండ్లు కూల్చడంపై అగ్గిమీద గుగ్గిలం అయిన ఎంఐఎం ఆందోళనలు చేసి చేతులు దులుపుకుంది కానీ ఆ పేదల పక్షాన పోరాటం చేయడంలో వెనక్కి తగ్గడానికి కారణం ఏంటన్నది ఆ పార్టీ నాయకులకే తెలియాలి. ఈ ఘటన జరిగినప్పుడు హంగామా సృష్టించిన ఆ పార్టీ నాయకులు ఆ తరువాత ఎందుకు మిన్నకుండి పోయారో అంతుచిక్కకుండా పోయింది. అప్పడు అధికారంలో ఉన్న పెద్దల అండదండలు ఏ స్థాయికి చేరాయంటే… ఈ భూమి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుతో పట్టాదారు పాసుపుస్తకాలు వెంటనే మంజూరు చేయాలంటూ జిల్లా కలెక్టర్ పై కూడా ఒత్తిళ్లకు గురి చేసేంత. ప్రతర్థి పార్టీ అప్పర్ కోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉన్న కారణంగా ఆ కలెక్టర్ పాసు పుస్తకాలు ఇచ్చేందుకు నిరాకరిస్తే ఆయనను ఏ స్థాయిలో ప్రభావం చేయాలని చూశారో రెవెన్యూ విభాగం అంతా కోడై కూసింది నాడు. కరీంనగరంలో కూడా ఇలాంటి బుల్డోజర్లు ఇండ్లను కూల్చివేసేందుకు రంగంలోకి దిగాయి. బలహీనుడిగా కనిపిస్తే చాలు బలవంతుల చేతిలోకి డాక్యూమెంట్లు పుట్టుకొచ్చాయి… అవే అసలైనవన్న వాదనలు కూడా ‘‘సపరేట్’’ సెటిల్ మెంట్ కేంద్రాలలో వినిపించాయి. వారసత్వంగా సంక్రమించిన ఆస్తులని నెత్తినోరు బాదుకున్నా అసలు యజమాని అధ:పాతాళానికి తొక్కబడితే అక్రమార్కులకు అందలం ఎక్కించిన చరిత్ర నాటిది.
ఠాణాలకు చేరినా…
ఇకపోతే బుల్డోజర్లతో ఇండ్లను కూల్చిన తరువాత కొంతమంది ధైర్యం చేసి ఠాణా మెట్లెక్కినా వాటిని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టినా బాధితులపైనే ఖాకీలు కన్నెర్రజేసిన సందర్భాలు ఎన్నెన్నో. ఇండ్ల కూల్చివేతకు ఉపయోగించిన బుల్డోజర్లు రోజుల కొద్ది స్టేషన్లలో ఉన్నా దాని ఓనర్లు దొరకకపోయే వారు.. డ్రైవర్లు ఆచూకి అసలే ఉండకపోయేది. చట్టం కూడా తమకు అనుకూలంగా మారిందన్న విషయాన్ని గమనించిన కొంతమంది యజమానులు తమ బుల్డోజర్లను కేవలం ఇండ్ల నిర్మాణాల కూల్చివేత కోసం మాత్రమే అద్దెకు ఇస్తామంటూ సిండికేట్ అయ్యారు. ఇందుకు తగినట్టుగా అక్రమాలకు పాల్పడే ‘‘పెద్దలు’’ కూడా భారీ స్థాయిలో అద్దె చెల్లిస్తుండడంతో బుల్డోజర్ బ్యాచుల ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. మరో వైపున కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలేజీ భాగస్వాముల మధ్య జరిగిన గొడవలో బాధితుడు ఠాణాల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోయాడు. ఆ తరువాత మళ్లీ కాలేజీలోకి వెల్లి తన పేరిట ఉన్న రికార్డులన్ని మాయం చేశారని లెక్కలు చూపాలని అడిగినందుకు అక్కడి సీసీ కెమెరాల ఫుటేజీ అదృశ్యం అయిపోగా, బాదితుడే నిందితుడిగా మారి అట్రాసిటి కేసులో ఇరుక్కున్నాడు. భాగస్వాములు ఇద్దరు అగ్రవర్ణాలకు చెందిన వారే కాగా అట్రాసిటీ కేసు కేసు కావడానికి కారణం ఏంటీ.? అక్కడ ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఎందుకు ఉన్నారు..? సంస్థలో ఉద్యోగం చేసే వారయితే భాగస్వాములకు సంబంధించిన గొడవలోకి ఎందుకు లాగబడ్డారు తదితర విషయాలన్ని అటకెక్కిపోయాయి. కేవలం బలవంతుల అండ ఉందిగా అట్రాసిటీ కేసు పెట్టాలంతే అన్నట్టుగా యాంత్రికంగా పనిచేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కరీంనగర్ లోని ఓ ఆసుపత్రి భాగస్వాముల మధ్య పంచాయితీ అయితే తనకు న్యాయం చేయాలని బాధితుడు సదరు ‘కీ’ రోల్ వ్యక్తి వద్దకు వెల్తే అంచనాలు తలకిందులు చేసి లాభాల్లో వాట లెక్కల మాట అటుంచి.. పెట్టుబడిలోనే తక్కువ డబ్బులు ఇప్పించడమే కాకుండా ఓ కార్పోరేటర్ ద్వారా నేను అతని కోసం కష్టపడ్డా ‘లకారాలు’ ఇస్తాడా చస్తాడా అంటూ హెచ్చరికల పరంపర కొనసాగిందప్పుడు. భగత్ నగర్ భూమి విషయంలో సింగరేణి రిటైర్డ్ కార్మికుడు రాజిరెడ్డి అలుపెరగని పోరాటం చేయడం, ఎన్నికల పుణ్యమా అని కమిషన్ ఆదేశాలతో సీపీగా అభిషేక్ మహంతి రావడంతో అతనికి న్యాయం జరిగింది. కానీ ఆనాడు బలవంతుల చేతిలో చిక్కి శల్యమై పోయి జీవఛ్చవాల్లా మారిపోయిన కుటుంబాల సంఖ్య లెక్కకు లేనివనే చెప్పాలి. ఈ సంఘటనలు కేవలం మచ్చుకు మాత్రమే… ఇలాంటి ఘటనలు నాడు నిత్యకృత్యంగా సాగాయన్నది జగమెరిగిన సత్యం.