అప్పుడు కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో… ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులో …
కలకలం సృష్టిస్తున్న నేరాల తీరు…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ లో సర్కారు కార్యాలయాలే లక్ష్యంగా చోరీలు జరగుతున్నాయ్… ప్రభుత్వ ఆఫీసుల్లోకి చొరబడుతున్న అగంతకులు దొంగతనాలకు పాల్పడుతున్న తీరు సంచలనంగా మారింది.
కలెక్టర్ క్యాంప్ ఆఫీస్…
శత్రు దుర్భేద్యంగా ఉండే కరీంనగర్ కలెక్టరేట్ క్యాంపు ఆఫీసులో చోరీ జరగడం కలకలం సృష్టించింది. చుట్టూ సెక్యూరిటీ లోపల సీసీ కెమెరాలు… నిరంతరం ఉద్యోగులు తిరుగుతూ ఉండే కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో దొంగతనం జరగడం కలకలం సృష్టించింది. అక్టోబర్ చివరి వారంలో జరిగిన ఈ ఘటనలో అగంతకుడు మునిసిపల్ ఆఫీస్ వైపు ఉన్న కంపౌండ్ వాల్ దూకి చోరీకి పాల్పడినట్టుగా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే అప్పుడు కరీంనగర్ కలెక్టర్ గా పనిచేసిన గోపికి సంబంధించిన ల్యాప్ టాప్ తో పాటు ఇతర డాక్యూమెంట్లు దొంగతనానికి గురయ్యాయని తెలిసింది. అయితే ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. చోరీకి గురైన ల్యాప్ టాప్ ను కూడా రికవరీ చేశామని వెల్లడించారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీసే లక్ష్యం చేసుకుని అగంతకుడు చోరీకి పాల్పడడం మాత్రం అంతుచిక్కకుండా పోయింది. మునిసిపల్ కార్యాలయం కానీ, క్యాంపు ఆఫీసుకు సమీపంలోనే ఆర్ అండ్ బితో పాటు ఇతర విభాగాలకు చెందిన కార్యాలయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కలెక్టర్ క్యాంప్ ఆఫీసుకు మరో వైపున జడ్పీ ఆఫీసతో పాటు శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫీసు కూడా ఉంది. అంతేకాకుండా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రధాన కూరగాయల మార్కెట్ లో సూపర్ బజార్ లోతో పాటు ప్రైవేటు వ్యాపారులకు సంబంధించిన దుకాణ సమూదాయాలు కూడా ఉన్నాయి. కానీ అగంతకుడు ప్రత్యేకంగా కలెక్టర్ క్యాంప్ ఆఫీసులోకే చొరబడడం వెనక ఆంతర్యం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది. కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో చోరీ చేసేందుకు ఎలా సాహసించాడన్నది మాత్రం ఇప్పటికీ పజిల్ గానే మారింది.
తాజాగా రిజిస్ట్రేషన్ కార్యాలయం…
ఇకపోతే జిల్లాకు చెందిన అన్ని విభాగాలకు చెందిన కార్యాలయాన్ని కూడా ఒకే చోట ఉన్న కలెక్టరేట్ కాంప్లెక్స్ లో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులో చోరీ జరగడం సంచలనంగా మారింది. అగంతకుడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి చొరబడి డాక్యూమెంట్లను ఎత్తుకెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది కానీ పూర్తి క్లారిటీ మాత్రం రావడం లేదు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న వన్ టౌన్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. క్లూస్ టీంను రంగంలోకి దింపడంతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీని కూడా సేకరించి చోరీకి పాల్పడిన వ్యక్తి కోసం ఆరా తీస్తున్నారు. నిందితుల కోసం గాలింపు కూడా చేపట్టినట్టుగా తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే కరీంనగర్ రూరల్, టౌన్ ఏసీపీ కార్యాలయాలు కూడా ఉన్నాయి. మరో వైపున అడిషనల్ కలెక్టర్ తో పాటు ఇతర అధికారుల క్వార్టర్స్ ఉన్నాయి. అయినప్పటికీ అగంతకుడు అంత ధైర్యంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోరీకి పాల్పడడం సంచలనంగా మారింది.
లక్ష్యం ఏంటో..?
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా చోరీలు జరుగుతుండడం వెనక కారణాలేంటన్నదే అంతుచిక్కకుండా పోయింది. ఇంతకాలం ప్రైవేటు వ్యక్తుల ఇండ్లలోకి చొరబడిన సంఘటలు, తాళం వేసిన ఇళ్లకు కన్నం వేసిన ఘటనలు చోటు చేసుకోగా ఇప్పుడు మాత్రం ప్రభుత్వ కార్యాలయాల్లో చోరీ ఘటనలు జరుగుతుండడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది. కలెక్టర్ క్యాంప్ ఆఫీసులోకి చొరబడిన ఘటనే అయినా, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దొంగతనానికి పాల్పడిన తీరే అయినా అగంతకులు మాత్రం టార్గెట్ పెట్టుకునే చేసినట్టుగా అనిపిస్తోంది.