బ్యాలెట్ బాక్సులు అప్పగించి వెల్తుండగా ఘటన
దిశ దశ, గంగాధర:
కరీంనగర్, జగిత్యాల రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూంలో అప్పగించి వెల్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ కారణంగా డ్రైవర్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న ఎన్నికల అధికారులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గంగాధర సమీపంలోని నెమలికొండ రైల్వేగేట్ వద్ద భారీ సైజులో స్పీడ్ బ్రేకర్లు ఉండడడంతో పాటు రోడ్డు కూడా గుంతలమయంగా ఉండడంతో బస్సు డ్రైవర్ గమనించలేకపోవడంతో సడెన్ బ్రేక్ వేయడంతో వెనక వెల్తున్న బస్సును డీకొట్టింది. దీంతో బస్సు దెబ్బతిన్నది. రైల్వే గేట్ వద్ద స్పీడ్ బ్రేకర్లను అంచనా వేసే పరిస్థితి లేకపోగా, లైట్లు కూడా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాంతం మీదుగా వెల్లే వాహనదారులకు తరుచూ ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాత్కాలికంగా అయినా అక్కడ అప్రమత్తత చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని ప్రయాణీకులు అంటున్నారు. వరంగల్, జగిత్యాల వరకు నేషనల్ హైవే నిర్మాణం అవుతున్నప్పటికీ ఆ రోడ్డు పూర్తయ్యే వరకూ వాహనదారులు పాత రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాల్సిన ఆవశ్యకత ఉన్నందున అధికారులు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.