గుజరాత్ లో హనీ ట్రాప్… కోట్లు పోగోట్టుకున్న వ్యాపారి

సైబర్ నేరాలకు పాల్పడే వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇటీవల కాలంలో కిలాడీ లేడీస్ హనీ ట్రాప్ కు పాల్పడుతున్న సంగతి తెలిసింది. ఇలాంటి సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నా ట్రాప్ లో పడే వారు మాత్రం పడుతూనే ఉన్నారు. కోట్లు పోగోట్టుకుంటూ లబోదిబోమంటూనే ఉన్నారు. చివరకు తాము మోసపోయామని తెలిసి పోలీసులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. నిత్యకృత్యంగా మారిన ఈ క్రైంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2.69 కోట్లు పోగొట్టుకున్నాడు ఓ వ్యాపారి. చివరకు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పోలీసులను ఆశ్రయించాడు. ఓటీపీ నెంబర్లతో డబ్బులు డ్రా చేసుకునే ముఠాలను మించి వ్యవహరిస్తున్న హనీ ట్రాప్ గ్యాంగ్స్ విషయంలో అప్రమత్తంగా లేకపోతే జేబులు ఖాలీ కావడం ఖాయమన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో మీరూ తెలుసుకోండి…

రూ. 2.69 కోట్లు హంఫట్

గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారి రియాశర్మ పేరుతో వచ్చిన కాల్ హనీ ట్రాప్ కు గురయ్యారు. ఆయనకు ఫోన్ చేసి తీయని మాటలతో ట్రాప్ లో పడేసిన యువతి నగ్నంగా వీడియో కాల్ చేసి అతడిని కూడా అలా మారమని చెప్పింది. వ్యాపారి కూడా నగ్నంగా మారిన తరువాత సదరు యువతి
ఆ దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ కు పాల్పడింది. ఈ ఒక్క వీడియో పేరిట ఒకరి తరువాత ఒకరు ఏకంగా 11 మంది ఫోన్ చేసి రూ. 2.69 కోట్లు కొల్లగొట్టారు. గత ఆగస్టు 8న మోర్బికి చెందిన రియా శర్మ పేరుతో వ్యాపారికి ఫోన్ కాల్ చేసిన అగంతకురాలు వ్యాపారిని తన వైపు తిప్పేసుకుంది. వ్యాపారి ఆమె వలలో చిక్కుకుని వెనకాముందు ఆలోచించకుండా ఆమె చెప్పినట్టుగానే చేశాడు. ఆ దృశ్యాలను రికార్డు చేసిన ఆమె బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ వ్యాపారిని నిలువుదోపిడి చేసింది. వ్యాపారికి చెందిన నగ్న వీడియోలు బయటకు రాకుండా ఉండాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని మొదట డిమాండ్ చేయగానే తన పరువు పోతుందేమోనన్న భయంతో ఆమె అడిగినంత డబ్బు ఇచ్చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరో వ్యక్తి ఫోన్ చేసి తాను ఢిల్లీ ఇన్‌స్పెక్టర్ శర్మగా పరిచయం చేసుకున్నాడు. నగ్న వీడియో క్లిప్ తన వద్దకు చేరిందని బెదిరించి రూ. 3 లక్షలు వసూలు చేశాడు. ఆగస్టు 14న ఢిల్లీ సైబర్ సెల్‌ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి వీడియో కాల్ భయంతో రియాశర్మ ఆత్మహత్యకు యత్నించిందని బెదింరిపులకు పాల్పడి వ్యాపారి నుండి రూ. 80.97 లక్షలు వసూలు చేశారు. మరికొన్ని రోజులకు సీబీఐ అధికారినంటూ మరో వ్యక్తి ఫోన్ చేసి రియాశర్మ తల్లి సీబీఐని ఆశ్రయించిందని, కేసు సెటిల్‌మెంట్ చేసుకోవాలనుకుంటే రూ. 8.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఆ అగంతకుడు అడిగినంత డబ్బు ముట్టచెప్పాడు. ఈ లావాదేవీలన్ని కూడా హనీ ట్రాప్ ముఠా బ్యాంకు అకౌంట్లలో జరపకుండా జాగ్రత్త పడి నగదు మాత్రమే తీసుకుంది. హనీ ట్రాప్ ముఠా మరో అడుగు ముందుకేసి గత డిసెంబరు 15న ఈ కేసును మూసివేస్తున్నట్టు పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు పేరిట ఉత్తర్వులు పంపించింది. కేసు క్లోజీంగ్ కు సంబదించిన ఆర్డర్లు నకిలీవని గుర్తించిన సదరు వ్యాపారి లబోదిబోమన్నాడు. ఈ నెల 10న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు మొత్తం 11 మంది కాల్ చేసి రూ. 2.69 కోట్లు కాజేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అజాగ్రత్తగా ఉంటే…

హనీ ట్రాప్ లో భాగంగా అమ్మాయిలే నగ్నంగా మారిపోయి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుంటే వారి వలలో చిక్కుకుంటున్నారు. అయితే అమ్మాయిలే ఇలా వ్యవహరిస్తుంటే తామెందుకు భయపడాలి అన్న విషయాన్ని విస్మరించి ట్రాప్ టీమ్స్ అడిగినంత ముట్టచెప్తున్నారు. దీంతో ఈ రకమైన నేరాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోందని పోలీసులు కూడా చెప్తున్నారు. ఇంతకాలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం అయిన హనీ ట్రాప్ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు కూడా చేరుకుంటోంది. ఈ క్రమంలో డబ్బులున్న వారు పరువు కోసం పాకులాడే అవకాశాలు ఉన్నాయని గుర్తించి మోసాలకు పాల్పడే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి అలెర్ట్ గా ఉండాల్సిన ఆవశ్యకత అయితే ప్రతి ఒక్కరిపైనా ఉంది.

You cannot copy content of this page