ఉప ఎన్నికల తెలంగాణ…

ఉద్యమం నుండి తప్పని బైపోల్స్

ఇప్పటికీ అదే తంతు…

దిశ దశ, హైదరాబాద్:

స్వరాష్ట్ర కల సాకారం అయ్యేందుకు… తెలంగాణ ఆకాంక్ష ప్రపంచానికి చాటి చెప్పేందుకు తప్పని పరిస్థితుల్లో నాడు ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అదే విధానం తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా తప్పడం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఈ సారి కూడా ఉప ఎన్నికలు అనివార్యమేనని స్పష్టం అవుతోంది.

ఉద్యమ ప్రస్థానంలో…

2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలో నిలిచింది. అప్పుడు రాష్ట్ర క్యాబినెట్ లో కూడా ప్రాతినిథ్యం వహించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. 2008లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు అందుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రం ప్రయోగించారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత 2010లో మళ్ళీ రాజీనామా చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. 2004 లోక సభ ఎన్నికల తర్వాత కరీంనగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్ రెండు సార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. ఇలా తరచూ ఉప ఎన్నికల తంతుకు తెరలేపి రాష్ట్రంలో ఉద్యమాన్ని ఊర్రూతలూగించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకే దక్కింది.

స్వరాష్ట్రం సిద్దించిన తర్వాత…

2014లో స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో తొలిసారి సాధారణ ఎన్నికలు జరిగాయి. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఉప ఎన్నికల ఆనవాయితీ మాత్రం తప్పడం లేదు. 2020లో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు అనారోగ్యంతో చనిపోవడంతో వేర్వేరుగా ఉప ఎన్నికలు జరిగాయి. 2021లో అసైన్డ్ భూముల వ్యవహారంలో మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ వీడాల్సి రావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉప ఎన్నికలు జరిగాయి.

తాజా ఎన్నికలు…

తాజాగా జరుగుతున్న జనరల్ ఎన్నికలు కూడా ముందస్తుగానే ఉప ఎన్నికలు అనివార్యమని తేల్చి చెప్తున్నాయి. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఖచ్చితంగా బైపోల్స్ నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి, హుజురాబాద్, కొడంగల్ స్థానాల్లో ఏదో ఒక చోట ఉప ఎన్నికలు జరగక తప్పేలా లేవు. గజ్వేల్, కామారెడ్డిల నుండి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నందున రెండు చోట్ల ఆయన గెలిస్తే ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ఏదో ఒక చోట ఉప ఎన్నికలు జరగక తప్పదు. అలాగే కొడంగల్, కామారెడ్డిల నుండి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నందున ఆయన రెండు స్థానాల్లో గెల్చినట్టయితే ఏదో ఒక స్థానానికి రిజైన్ చేయాల్సిందే. అలాగే ఈటల రాజేందర్ హుజురాబాద్, గజ్వేల్ నుండి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ రెండు చోట్ల ఆయన గెలచినట్టయితే కూడా ఒక స్థానానికి రాజీనామా తప్పదు. ఈ మూడు స్థానాల్లో ప్రధాన అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొని ఉన్నందున ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు రెండు స్థానాల్లో గెలవక తప్పదు. దీంతో రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగక తప్పని పరిస్థితి నెలకొంది. ఒక వేళ ప్రధాన ప్రత్యర్థులను కాదని వేరే అభ్యర్థులకు ఆయా నియోజకవర్గ ఓటర్లు మద్దతు ఇస్తే మాత్రం ఉప ఎన్నికలు జరగవు.

You cannot copy content of this page