మా సామాజిక వర్గాన్ని గుర్తించలేదు…

యుద్దభేరి మోగించినా పట్టించుకోలేదు…

కోరుట్ల బంద్ కు పిలుపునిచ్చిన పద్మశాలీ సంఘం

దిశ దశ, జగిత్యాల:

తమ సామాజిక వర్గానికి రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ వినిపించినా పట్టించుకోలేదు. కోరుట్ల కేంద్రంగా యుద్దభేరి మోగించినా మాకు గుర్తింపు ఇవ్వకపోవడం మా సమాజాన్ని విస్మరించినట్టేనని భావిస్తున్నాం. కాబట్టి రాజకీయ పార్టీల వైఖరికి నిరసనగా కోరుట్ల నియోజకవర్గ బందుకు పిలుపునిస్తున్నామని పద్మశాలి సంఘం ప్రతినిధులు ప్రకటించారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా బందు పాటించి తమ డిమాండ్ సత్తా ఏంటో చూపించాలని సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు. గత ఆగస్టు నెలలో లక్ష మందితో పద్మశాలి సంఘ సమావేశం ఏర్పాటు చేసి తమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోట పార్టీలు తమకే టికెట్లు ఇవ్వాలని కోరినా కూడా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తమ గళాన్ని వినిపించినప్పటికీ రాజకీయ పార్టీలు పెడచెవిన పెట్టినందున పద్మశాలి సామాజిక వర్గంతో పాటు బీసీ బంధువులు కూడా అన్ని పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బంద్ కు అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు.

You cannot copy content of this page