రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రస్థానం…
దిశ దశ, మంథని:
నల్లకోటు వేసుకుని న్యాయ వాద వృత్తిని ఎంచుకున్న ఆయన ఐఏఎస్ కావాలని ఆకాంక్షించి అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1994 ఎన్నికల్లో ఆయన తండ్రి విజయం కోసం తొలిసారిగా ప్రజాల్లోకి వచ్చారు. రాజకీయాలంటేనే తెలియని ఆయన అన్నల ఇలాకాలో తిరిగి ఆ నాటి తరానికి పరిచయం అయ్యారు. అడబిడ్డలు, అన్నదమ్ములు అంతా విదేశాల్లో స్థిరపడితే తల్లిదండ్రులతో ఉండేందుకు ఇండియాకే పరిమితం అయ్యారు. తండ్రి హత్యతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన ఆ నాయుకుడి నేపథ్యం ఇది…
దుద్దిళ్ల శ్రీధర్ బాబు…
మంథని బుచ్చి పంతులు కొడుకుగా 1994 ఎన్నికల్లో తండ్రి విజయం కోసం నియోజకవర్గం అంతా కలియ తిరిగిన ధుద్దిళ్ల శ్రీధర్ బాబు రాజకీయాలను ప్రత్యక్ష్యంగా చూశారని చెప్పాలి. ఉమ్మడి రాష్ట్ర స్పీకర్ గా ఉన్న దుద్దిళ్ల శ్రీపాదరావు మూడో సంతానం అయిన శ్రీధర్ బాబు అన్నయ్యలు శ్రీకాంత్, శ్రీనాథ్, తమ్ముడు శ్రీనివాస్ లు ఉన్నత విద్య కోసం అమెరికా వెల్లి అక్కడే స్థిరపడిపోయారు. ఆయన అక్కయ్య వైజయింతి కూడా అమెరికాలోనే స్థిరపడగా చెల్లెలు వాణి వివాహం అనంతరం అమెరికాకు వెళ్లారు. దీంతో తల్లిదండ్రుల పంచనే ఉంటున్న శ్రీధర్ బాబు ఐఏఎస్ కావాలని ప్రయత్నించారు. హై కోర్టు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేపట్టిన ఆయన 1994 ఎన్నికల్లో తండ్రి శ్రీపాదరావు ఓటమి తరువాత ఎక్కువగా నియోజకవర్గ ప్రజలతో టచ్ లో ఉన్నారు. అనూహ్యంగా 1999 ఏప్రిల్ 13న శ్రీపాదరావును పీపుల్స్ వార్ నక్సల్స్ హత్య చేయడంతో రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు మంథని ఎమ్మెల్యేగా ఎన్నికయిన తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పని చేశారు. ఈ సమయంలో సీఎల్పీ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతంలో తనవంతు పాత్రను పోషించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో శ్రీధర్ బాబు మంత్రి కావల్సి ఉన్నప్పటికీ జిల్లా నుండి సీనియర్ ఎమ్మెల్యేలు ఉండడంతో వైఎస్ విప్ గా బాధ్యతలు అప్పగించారు. మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేకపోయిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న వైఎస్ శ్రీధర్ బాబుపై ప్రత్యేక అభిమానాన్ని చూపించేవారు. టీటీడీ బోర్డు మెంబర్ గా బాధ్యతలు అప్పగించడమే కాకుండా ఆయన అడిగిన ప్రతి పనికి ఓకె చెప్పారు వైఎస్. అంతేకాకుండా నక్సల్స్ ప్రభావం ఉన్న మహాముత్తారం మండలంలో కూడా సీఎం టూర్ ఏర్పాటు చేయడం, చిన్న కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయించుకున్నారంటే వైఎస్ తో శ్రీధర్ బాబు ఎంత సాన్నిహిత్యంగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిని రెండు సార్లు తన నియోజకవర్గంలో రప్పించుకున్న శ్రీధర్ బాబు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో పాటు ఐటీఐ వంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయించడంలో సఫలం అయ్యారు. 2009లో మూడో సారి ఎన్నికైన శ్రీధర్ బాబు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రులుగా చేసిన కొణిజేటి రోషయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిల క్యాబినెట్ లో కూడా మంత్రిగా పని చేశారు. నిజాం కాలేజీలో చదివిన శ్రీధర్ బాబు తనకన్న సీనియర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఆయన చీఫ్ విప్ గా ఉన్నప్పుడు శ్రీధర్ బాబు విప్ గా ఉండడంతో ఇద్దరి మధ్య నెలకొన్న అనుభందం మరింత కలిసి వచ్చింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఏకచత్రాధిపత్యం చెలాయించిన శ్రీధర్ బాబు తన బ్రాండ్ పాలిటిక్స్ కు తెరలేపారు. అప్పటి వరకు సీనియర్ పొలిటిషియన్లతో ఉన్న కరీంనగర్ లో శ్రీధర్ బాబుతో యంగ్ జనరేషన్ కు ఆస్కారం లభించినట్టయింది. అప్పుడు అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేసిన ఆయన కరీంనగర్ జిల్లాపై తిరుగులేని పట్టు సాధించారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి పుట్ట మధుపై ఓటమి చవి చూశారు. 2018, 2023 ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ఆయన మంథని నుండి అత్యధిక సార్లు ఎమ్మెల్యే అయిన రికార్డును సొంతం చేసుకున్నారు. 1957 నుండి 1972 వరకు పివి నరసింహరావు నాలుగు సార్లు ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందగా శ్రీధర్ బాబు ఐదు సార్లు గెలవడం విశేషం.
వైవిద్యమైన పరిస్థితులు…
ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత వైవిద్యమైన పరిస్థితులు మంథని నియోజకవర్గంలో ఉండేవి. 294 నియోజకవర్గాలలో బౌగోళికంగా అతిపెద్దదైన మంథని జీవనది గోదవరి పరవళ్లు, వాగుల వంకల ప్రవాహాల నడుమ విస్తరించి ఉంది. కీకారణ్యాలకు మారుపేరైన ఈ నియోజకవర్గంలో పీపుల్స్ వార్ నక్సల్స్ కు పెట్టని కోటగా ఉండేవి. అయితే విప్లవోద్యమాలకు కేరాఫ్ గా నిలిచిన మంథని మేధావులకు పుట్టినిల్లు కూడా కావడం విశేషం. ఇంటలెక్చువల్స్ ఓ వైపున, ఇంటిగ్రేటెడ్ ఏరియా మరో వైపున ఉన్న ఈ నియోజకవర్గాన్ని అభ్యున్నతి వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత శ్రీధర్ బాబు పైనే ఉంది. ఆద్యాత్మిక చారిత్రాత్మక నేపథ్యం ఉన్న మంథని నుండి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారనే చెప్పాలి. ఇక్కడి నుండి ఎన్నికైన పివి నరసిహరావు వివిధ శాఖలకు మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, శ్రీపాదరావు అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. శ్రీధర్ బాబు కూడా పలు శాఖలకు క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే పివి తరువాత వివధ శాఖల మంత్రిగా పనిచేసిన రికార్డు కూడా శ్రీధర్ బాబుకే దక్కింది. తాజా ఎన్నికల్లో పరిస్థితులు అనుకూలిస్తే ముఖ్యమంత్రిగా కూడా శ్రీధర్ బాబు పేరును పరిశీలించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వానికే మద్దతు ఇచ్చారు.