ప్రైవేటు విద్యా సంస్థల తీరు
దిశ దశ, కరీంనగర్:
ఓ వైపున పరీక్షలే మొదలు కాలేదు కానీ మరో వైపున ప్రచార హోరుతో పల్లెలు దద్దరిల్లిపోతున్నాయి. తమ పిల్లలు ఎంత జీపీఏ సాధిస్తారేమోనన్న టెన్షన్ కన్నా ఇంటర్ కాలేజీల పీఆర్వోలు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ను తప్పించుకోవడం ఎలా అన్న దానికే ప్రయారిటీ ఇవ్వవలసి వస్తోంది చాలా మంది పేరెంట్స్ కు. సొంత పనులు చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోటాపోటిగా ప్రైవేటు కాలేజీల సిబ్బంది పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను మచ్చిక చేసుకునేందుకు వారి ఇంటి బాట ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు.
ఊరు వాడ…
పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా ఉదయం 7.30 గంటలకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల ఇండ్ల ముందు వాలిపోవల్సి ఉంటుంది. ఏడాదికి 9 నెలల జీతమే ఇచ్చే విద్యాసంస్థలు అడ్మిషన్ల విషయంలో మాత్రం ఇష్టారీతిన లెక్చరర్లను వాడుకుంటాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. రోజు 12 గంటల లోపున ఎంత మంది విద్యార్థులను కలిశారో తెలయిజేస్తూ కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లేనట్టయితే వచ్చే విద్యా సంవత్సరం ఉద్యోగం రెన్యూవల్ ఉండదన్న భయం లెక్చరర్లో కల్పిస్తుంటారని ప్రచారంలో ఉంది. దీంతో కాలేజీల్లో పని చేసే ప్రతి ఒక్కరూ స్టూడెంట్స్ ఇంటి బాట పడ్తుంటారు. కార్పోరేట్ కాలేజీలు చాలా వరకు పదో తరగతి పరీక్షలు స్టార్ట్ కాకముందే అడ్మిషన్ల జాతరకు తెరలేపడం విస్మయం కల్గిస్తోంది. ఒక్కో అడ్మిషన్ కు రూ. 5 నుండి 10 వేల వరకు ఫీజు వసూలు చేసి స్టూడెంట్ కు అడ్వాన్స్ అడ్మిషన్ ఇచ్చే విధానాన్ని ప్రారంభించడం గమనార్హం. వాస్తవంగా ఈ ఏడాది ఏప్రిల్ 3 నుండి 11 వరకు 10 తరగతి పరీక్షలు నిర్వహిస్తోంది విద్యాశాఖ. అయితే ఇప్పటికే కార్పోరేట్ కాలేజీలన్ని కూడా తమ సిబ్బందిని అడ్మిషన్ల కోసం పురమాయించడం విచిత్రమనే చెప్పాలి. తమ బిడ్డ పరీక్షలకు ఎలా ప్రీపేర్ అవుతున్నాడోనన్న విషయాన్ని కూడా గమనించే అవకాశం కూడా ఇవ్వకుండా కార్పోరేట్ కాలేజీల యంత్రాంగం పేరెంట్స్ కు ఊపిరి సలపనివ్వకుండా ప్రచారం సాగిస్తున్నారు. పరీక్షల ఫలితాలు వచ్చే సరికే తమ కాలేజీల్లో అడ్మిషన్స్ పూర్తి చేసుకునే విధానానికి కార్పోరేట్ సిబ్బంది శ్రీకారం చుట్టడం మాత్రం విస్మయం కల్గిస్తోంది.
సాధారణ కాలేజీలు…
కార్పోరేట్ కాలేజీలు 10 తరగతి పరీక్షలు స్టార్ట్ కాకముందే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తుంటే 10 తరగతి పరీక్షలు ముగిసాయంటే చాలు సాధారణ కాలేజీ యాజమాన్యం తమ బలగాలను రంగంలోకి దింపుతుంటాయి. ఒక్కో విద్యార్థి అడ్మిషన్ కు రూ. 500 చొప్పున చెల్లిస్తామని చెప్పే యాజమాన్యాలు రోజుకు కనీసంన 25 నుండి 30 మంది స్టూడెంట్స్ ను కలిసి రావాలన్న షరతు విధిస్తోంది. ఏటా ఒక్కోక్కరు కనీసం 35 నుండి 40 అడ్మిషన్లు తీసుకరావాలని లేనట్టయితే వచ్చే విద్యా సంవత్సరంలో మీ ఉద్యోగం ఉండదన్న రీతిలో యాజమాన్యాలు వార్నింగ్ ఇస్తుంటాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఎంత చదువు చదువుకున్నా కుటుంబ పోషణ కోసం మరోకరి వద్ద పనిచేయాల్సిందే తప్ప మరో గత్యంతరం లేదన్న భాధతోనే లెక్చరర్లు అడ్మిషన్ల కోసం వేట ప్రారంభిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపెయిన్ నిర్వహించే కాలేజీలు అయితే సిబ్బందికి గ్రామాలను విభజించి బాధ్యతలు అప్పగించే పద్దతిని పాటిస్తున్నారని తెలుస్తోంది. దీనివల్ల సిబ్బంది మధ్య వైరుధ్యాలు పొడసూపవని భావించి యాజమాన్యాలు ఈ వ్యూహాన్ని రచించాయి. అయితే స్టాఫ్ మాత్రం విధిగా అడ్మిషన్లు తీసుకరావల్సిందే తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితే ఉంటుంది. దీంతో వీరు విద్యార్థుల పేరెంట్స్ ను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు పడే బాధలు అన్ని ఇన్నీ కావు.
డాటా ఎక్కడిదో..?
ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలో 10వ తరగతి కంప్లీట్ చేస్తున్న విద్యార్థుల డాటా ఎక్కడిది అన్నదే అంతుచిక్కని మిస్టరీగా మారిపోయింది. విద్యార్థుల ఆధార్ నెంబర్ నుండి మొదలు పేరెంట్స్ కాంటాక్ట్ నెంబర్లు కూడా ప్రైవేటు కాలేజీల యాజమాన్యం చేతికి చిక్కుతుండడం విడ్డూరం. ఇప్పటికే సైబర్ క్ర్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యార్థుల పూర్తి వివరాలు ప్రైవేటు కాలీజీల యాజమాన్యాల చేతికి దొరుకుతుండడం ఆందోళనకరమనే చెప్పాలి. ఇటీవల డాటా సేకరిస్తే వాటిని విక్రయిస్తున్న మఠాను సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్న విషయం ప్రస్తావనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వివరాలు ప్రైవేటు కాలేజీలకు అందుతుండడం అనేది ఆందోళన కల్గిస్తున్నది. ఈ డాటా అంతా అసాంఘీక శక్తుల చేతికి చిక్కితే వారు సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం కూడా లేకపోలేదు.