కొత్త పార్టీతో నేటితరం యువత బరిలోకి…
రాష్ట్రంలోని 32 స్థానాల్లో పోటీ…
అంతా ఉన్నత విద్యావంతులే…
దిశ దశ, హైదరాబాద్:
దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకరావాలన్న తపనతో ఆ యువకుడు సరికొత్త ఆలోచనతో ముందుకు సాగుతున్నాడు. 25 ఏళ్ల దాటిన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న విషయాన్ని అందరికీ తెలియజేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ధన బలం ఉన్న వారే కాదు సామాన్యుడూ పోటీ చేసేందుకు అర్హులే అన్న విషయాన్ని తెలియజెప్పడంతో పాటు నేటి తరానికి రాజకీయాలపై ఆసక్తి పెంచాలన్న సంకల్పంతో సరికొత్త పంథాలో ముందుకు సాగుతున్నారు.
తొలిసారి…
డీఆర్డీఓలో టెలిమెటరీ ఇంజనీర్ గా పనిచేసిన పెద్దపల్లి శ్రవణ్ ది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్. మిస్సైల్స్, భారీ విస్ఫోటనానికి ఉపయోగించే బాంబులను ఉపయోగించే ముందు ఈ విభాగంలో ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహిస్తుంటారు. రక్షణ రంగానికి సంబంధించిన ఈ విభాగంలో పనిచేస్తున్న శ్రవణ్ సొంత గ్రామానికి వచ్చి సేంద్రీయ పద్దతుల ద్వారా వివిధ రకాల పంటల రంగులు మార్చి పండించే పనిలో నిమగ్నం అయ్యారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో బారతీయ యువదళం పార్టీ పేరిట పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రచారంతో రాష్ట్ర వ్యాప్తంగా 60మందికి పైగా యువత పోటీ చేసేందుకు సమాయత్తం అయ్యారు. వీరిలో ఇప్పటికే 32 మంది పోటీలో నిలబడే అవకాశాలు ఉన్నాయి. వీరిలో వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నవారో, ఉన్నత విద్యావంతులే ఉండగా, నిరుద్యోగ యువత కూడా ఉంది. తొలిసారి చేస్తున్న ప్రయత్నం కాబట్టి వీరంతా కూడా ఈ సారి స్వతంత్ర్య అభ్యర్థులుగానే పోటీ చేయనున్నారు. రానున్న కాలంలో భారతీయ యువదళం పార్టీని నేషనల్ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
ఒక ప్రచార రథం… రెండు చోట్ల…
ఇకపోతే పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో పెద్దపల్లి శ్రవణ్, పెద్దపల్లి సందీప్ అన్నదమ్ములు ఇద్దరు పోటీ చేస్తున్నారు. అయితే ఆర్థిక వనరులు అంతగా లేనందున రెండు నియోజకవర్గాలకు ఒక ప్రచార రథాన్ని తిప్పేందుకు అనుమతి కూడా తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారుల వద్ద ఈ మేరకు అనుమతులు తీసుకున్న పెద్దపల్లి బ్రదర్స్ ఒక రోజు రామగుండంలో మరో రోజు పెద్దపల్లిలో తిరుగుతూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒకే వాహనంపై ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తుండడం అత్యంత అరుదైనదేనని చెప్పక తప్పదు.
అవగాహన కోసమే…
అయితే పెద్దపల్లి శ్రవణ్, సందీప్ లు ఇద్దరు గెలుస్తామన్న ఆశతో మాత్రం నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ జనరేషన్ కు భారత ఎన్నికల తీరుపై అవగాహన కల్పించడం, ఆర్థికంగా బలంగా ఉన్న వారే పోటీ చేయాలన్న భావన కూడా సరికాదని నేటి తరానికి తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే వీరి ప్రయాణం సాగుతోంది. 25 ఏళ్లు దాటితే చాలు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎవరైనా అర్హులేనన్న విషయాన్ని కూడా నేటి తరానికి వివరించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఈ ఇద్దరు అన్నదమ్ములు.