దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల మునిసిపల్ లో అవిశ్వాస రాజకీయం వెనక అసలేం జరిగింది..? కౌన్సిలర్లు అంతా ఇంఛార్జి ఛైర్మన్ కు వ్యతిరేకంగా జట్టు కట్టారా..? ఆయన్ని గద్దె దింపేందుకు అధికార పక్షం పావులు కదుపుతోందా..? ఇప్పుడిదే అంశంపై హాట్ టాపిక్ నడుస్తోంది. జగిత్యాల పట్టణంలో.
ఉన్నట్టుండి అవిశ్యాసం ఏంటి..?
బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో బలం ఉన్నప్పటికీ కౌన్సిలర్లు ఎదురు తిరిగారెందుకన్నదే మిస్టరీగా మారింది. క్యాంపు రాజకీయాలకు తెర లేవలేదు, అసమ్మతి వర్గం సమావేశాలూ జరగలేదు కానీ ఎవరూ ఊహించిన విధంగా అవిశ్వాసం ప్రకటిస్తూ కౌన్సిలర్లు కలెక్టర్ కు దరఖాస్తు చేయడం అందరినీ ఆశ్యర్య పరిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అయినప్పటికీ కౌన్సిలర్లు ఎందుకు ఇలాంటి చర్యకు పూనకున్నారన్నదే అంతు చిక్కకుండాపోయింది.
ఆయన ప్రయత్నమేనా..?
అయితే జగిత్యాలలో అనూహ్య పరిణామాల కారణంగా ఇంఛార్జి మునిసిపల్ ఛైర్మన్ గా గోలి శ్రీనివాస్ ఇంఛార్జి బాధ్యతలు తీసుకోవల్సి వచ్చింది. మునిసిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి పదవికి రాజీనామా చేసి పార్టీని వీడడంతో వైస్ ఛైర్మన్ గా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఆయన తనను ఈ బాధ్యతల నుండి తప్పించాలని గతంలో జిల్లా కలెక్టర్ కు వినతి చేశారు. గోలి శ్రీనివాస్ అభ్యర్థన విషయంలో అధికారులు సానుకూలంగా స్పందించలేదు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కూడా మునిసిపల్ ఛైర్మన్ గా తనకు అప్పగించిన ఇంచార్జి బాధ్యతల నుండి తప్పించాలన్న ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది.
మంత్రాంగం ఎవరిదో..?
అయితే తనకు అప్పగించిన ఇంఛార్జి బాద్యతల నుండి అధికారులు తప్పించే అవకాశం లేదన్న విషయాన్ని గమనించిన శ్రీనివాసే వ్యూహత్మకంగా కౌన్సిలర్లచే అవిశ్వాస తీర్మాణం అంశాన్ని లేవనెత్తినెట్టుగా తెలుస్తోంది. తనకు ఇచ్చిన అదనపు బాధ్యతల నుండి తప్పించాలని పలు మార్లు అభ్యర్థించిన లాభం లేకపోవడంతో అవిశ్వాసం రాజకీయానికి తెరలేపారన్న ప్రచారం జరుగుతోంది. అయితే తనకు బాధ్యతలు అప్పగించిన ఏఢాది పూర్తవుతోందని మునిసిపల్ ఛైర్మన్ బాధ్యతలను తొలగించి వైస్ ఛైర్మన్ గా కొనసాగించాలని గోలి శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్లలో ఎక్కువ మంది అవిశ్వాస తీర్మాణం కోసం దరఖాస్తు చేయడం గమనార్హం. ఇటీవల అంతర్గతంగా జరిగిన సమావేశంలో కూడా శ్రీనివాస్ తనను బాధ్యతల నుండి తప్పించాలని ముఖ్య నాయకుల ముందు కూడా వ్యాఖ్యానించినట్టుగా పార్టీ వర్గాల సమాచారం.
అవిశ్వాసం ఉంటుందా..?
మరో వైపున మారిన పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించేందుకు అధికారులు జగిత్యాల మునిసిపల్ ఛైర్ పర్సన్ బాధ్యతలను వైస్ చైర్మన్ కు అప్పగించారు. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయానికి కారణంగా పరిపాలనపరమైన అంశాల్లో భాగంగా ఛైర్ పర్సన్ బాధ్యతలు వైస్ ఛైర్మన్ కు అప్పగించారు. కానీ కౌన్సిలర్లు ఎవరూ కూడా గోలి శ్రీనివాస్ ను ఎన్నుకోలేదు. బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఈ స్థానంలో పురుషులను ఎన్నుకునే విధానాన్ని చట్టం అనుమతించదు. కాబట్టి అధికారులు తమకున్న విశేషమైన అధికారాలను ఉపయోగించి ఇంఛార్జి బాద్యతలు అప్పగించారు. అయితే ఇంఛార్జి మునిసిపల్ ఛైర్ పర్సన్ పై అవిశ్వాసం పెడుతూ మెజార్టీ సభ్యులు కలెక్టర్ కు దరఖాస్తు చేశారు. తాము ఇంచార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పదవిపై అవిశ్వాసం పెట్టేందుకు చట్టం అనుమతిస్తుందా లేదా అన్న విషయం తేలాల్సి ఉంది. ప్రజా స్వామ్య పద్దతిలో కౌన్సిలర్లు ఇంఛార్జి ఛైర్మన్ ను ఎన్నుకోనప్పుడు అవిశ్వాసం ఎలా పెడతారన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అవిశ్వాసం కోసం జగిత్యాల కౌన్సిలర్లు ఇచ్చిన దరఖాస్తును ఫిర్యాదుగా స్వీకరిస్తారా లేక అవిశ్వాసం కోసం నోటీసు ఇస్తారా అన్న విషయంపై వారు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.
క్రెడిట్ ఎవరి ఖాతాలోకి..?
మునిసిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి రాజీనామా తరువాత రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఫుల్ చార్జి ఛైర్ పర్సన్ ను ఎన్నిక చేసే విషయంలో నాయకత్వం మీనామేషాలు లెక్కించింది. శ్రావణికి వ్యతిరేకంగా కౌన్సిలర్లు జట్టు కట్టి పొమ్మనలేక పొగబెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే శ్రావణి రాజీనామా తరువాత బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు చైర్ పర్సన్ పదవి కోసం పోటీ పడ్డారు. ఎవరో ఒకరికి ఈ పదవిని కట్టబెడితే మిగతా వారంతా వ్యతిరేకం అవుతారని దీంతో అసమ్మతి రాజుకుంటుందని భావించిన నాయకత్వం ఇంఛార్జి బాధ్యతలను వైస్ ఛైర్మన్ కు అప్పగించి కాలం వెల్లదీశారు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం… ఇంఛార్జి మునిసిపల్ ఛైర్ పర్సన్ పై అవిశ్వాసం కోసం దరఖాస్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా జగిత్యాల బల్దియాలో నెలకొన్న రాజకీయాలు అధికార పార్టీకి అనుకూలంగానే మారిపోయాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మునిసిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక తంతును పూర్తి చేస్తే పూర్తి కాలం ఆ పార్టీ చేతిలోనే బల్దియా ఉండిపోయేది. కానీ తాజాగా అవిశ్వాస రాజకీయలతో క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెల్లిపోయినట్టయింది.