కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు
దిశ దశ, కరీంనగర్:
రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చెవాకులు మానుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తీర్మాణం చేస్తే అంత భయమెందుకని కాంగ్రెస్ కరీంనగర్ లోకసభ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో పలు విషయాలను ఊటంకించారు. కేంద్ర ప్రభుత్వం నుండి రూ. వెయ్యి కోట్లు మంజూరు చేయించే దమ్ము ఉందా అని అడిగారు. కరీంనగర్ కు కీలకమైన ప్రాజెక్టు మంజూరు చేయించి యువతకు ఉపాధి కల్పించే మార్గం అన్వేషించాలని డిమాండ్ చేశారు. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చే నిధులతో చేపట్టే పనులను అభివృద్ది అనరని, స్పెషల్ ఫండ్ మంజూరు చేసినప్పుడు ప్రత్యేక చొరవ తీసుకున్నట్టవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఆవాస్ యోజన, హర్గర్ జల్ యోజన, పీఎం జెన్ ఆరోగ్య యోజన, పీఎం మత్స్స సంపద యోజన, అటల్ బీమా యోజన, పీఎం విశ్వకర్మ యోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా కరీంనగర్ నియోజకవర్గంలో 10,000 మందికైనా లబ్ది చేకూర్చారా అని ప్రశ్నించారు. ఈ పథకాల ద్వారా ఎంతమందికి లబ్ది చేకూర్చారో బహిరంగ పర్చాలని వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకు కెటాయించిన నిధులు కెటాయించడంలో వివక్ష చూపుతున్న విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైందని, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నాయేనని స్పష్టం చేశారు. రానున్న బడ్జెట్ లలో అయినా కరీంనగర్ కు స్పెషల్ ప్యాకేజీ ద్వారా నిధులు విడుదల చేయించాలని, అలాగే రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్రం నుండి నిధులు ఇప్పించేందుకు చొరవ చూపాలని కోరారు. వేములవాడ, కొండగట్టు ఆలయాల అభ్యున్నతి కోసం నిధులు కెటాయించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం మాని అభ్యున్నతి కోసం కేంద్ర మంత్రి పాటు పడాలని వెలిచాల సూచించారు.