నగ్నంగా ఆలయాల దర్శానాలు చేసుకోవచ్చా..? ఆగమ శాస్త్రాలు ఏం చెప్తున్నాయ్..?

అఘౌరీ ఆలయాల సందర్శనపై సరికొత్త చర్చ

దిశ దశ, జగిత్యాల:

ఆలయాల్లోకి వెల్లే వారు సాంప్రాదాయ దుస్తులు ధరించాలన్న నిబంధనలు ఉన్నాయి. డ్రెస్ కోడ్ లేకుండా ఆలయంలోకి ప్రవేశించే వారికి అనుమతిని నిరాకరిస్తారు ఆలయ అధికారులు. అయితే తాజాగా తెలంగాణ జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాల్లో మహిళా అఘౌరీ ప్రత్యేక పూజలు చేస్తున్న తీరు సరికొత్త చర్చకు దారి తీస్తోంది. నగ్నంగా ఆలయాల్లోకి ప్రవేశం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అఘౌరీ దర్శనాలు…

గత రెండు రోజలుగా తెలంగాణాలోని వివిధ క్షేత్రాలను సందర్శిస్తున్నారు ఓ మహిళా అఘౌరి. తన శిష్య బృందంతో కలిసి పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. కొమురవెల్లి, కొండగట్టు ఆలయాలను సందర్శించిన నాగసాధు రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు వెల్తానని కూడా ప్రకటించారు. అయితే శరీరంపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఆలయాలకు వెల్లడం సరైంది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. హరిద్వార్, కాశీలాంటి పుణ్య క్షేత్రాల సమీపంలో వీరంతా ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో శివ నామస్మరణలో మునిగి తేలుతుంటారు. సాధారణ భక్తుల మధ్యకు వచ్చే అవకాశం లేకపోవడంతో వారు ఉన్న ప్రాంతంలోనే నటరాజును ఆరాధిస్తుంటారు. అయితే ఆలయాల్లోకి వచ్చినప్పుడు పూర్తి వివస్త్రలుగా కాకుండా కొంతమేర వస్త్రాలు ధరించుకునే ఆలయాలను సందర్శిస్తారని అంటున్నవారూ లేకపోలేదు. అయితే కొండగట్లు అంజన్న, కొమురవెల్లి మల్లన్న ఆలయాలను దర్శించుకున్న మహిళా అఘౌరి మాత్రం మెడలో రుద్రాక్ష మాలలు, చేతికి కంకణాలు ధరించి, శరీరమంతా కూడా విభూది రాసుకున్నారు. కానీ ఆమె శరీరంపై ఎలాంటి వస్త్రాలు లేకుండానే ఆలయాలను సందర్శిస్తుండడం గమనార్హం. అయితే గతంలో తెలంగాణలోని కొన్ని ఆలయాల్లో దర్శనం చేసుకునేందుకు మగ అఘౌరాలు వచ్చినప్పుడు ఆలయ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. నగ్నంగా ఆలయంలోకి అనుమతించేది లేదని, వస్త్రాలు ధరించాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే బుధవారం మాత్రం మహిళా అఘౌరీ విషయంలో మాత్రం ఇలాంటి సాంప్రాదాయం పాటించనట్టుగా స్పష్టం అవుతోంది. ఈ విషయంలో ఆగమ శాస్త్రాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రహస్యంగా, ఎవరూ లేని సమయంలో నగ్నంగా పూజలు చేసే సాంప్రాదాయం శతాబ్దాల క్రితం కొనసాగేదని చరిత్ర చెబుతోంది. కానీ జనసమ్మర్దమున్న ప్రాంతాల్లో ఇలాంటి ఆచారాలు కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది. ఇలాంటి వారి విషయంలో ఆగమ శాస్త్రాలు, దేవాదాయ నిబంధనలు ఏం చెప్తున్నాయో కూడా తేల్చాల్సిన అవసరం ఉంది.

అఘౌరీలు ఎవరూ..?

అసలు అఘౌరీలు అంటే ఎవరు..? కాశీ, హరిద్వార్, హృషికేష్ తో పాటు హిమాలయాల్లో మాత్రమే సంచరిస్తూ శివయ్యను ఆరాధిస్తూ కాలం వెల్లదీస్తారాని ప్రచారంలో ఉంది. వీరితో సమాజానికి సంబంధాలు ఉండవని శివారాధనలోనే తన్మయత్వం చెందుతూ నిశిరాత్రి వేళల్లో మాత్రమే నది తీరాల్లో సంచరించడం కానీ, సమీప ఆలయాల్లో పూజలు చేయడం కానీ చేస్తుంటారని చెప్తుంటారు. అలాగే వీరు ఆ పుణ్య క్షేత్రాలలో ఉండే శ్మశానాల్లోని చితులపై కూర్చుని అర్థరాత్రి వేళల్లో పూజలు చేస్తారని అంటుంటారు. రుద్రభూమిగా పిలిచే శ్మశాన వాటిల్లో శివుడు ఉంటాడన్న కారణంతో పాటు మరణించిన వారంతా కూడా శివైక్యం చెందుతారన్న భావనతోనే ఇలాంటి పూజలుకు ప్రాధాన్యత ఇస్తారని అంటుంటారు. కానీ వీరు నగ్నంగా బయటకు వస్తారా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. తాజాగా తెలంగాణా ఆలయాల్లో అఘౌరీ దర్శనాల కోసం సంచరిస్తున్న వేష ధారణ విషయంలో చర్చలు మొదలయ్యాయి. అయితే అఘౌరీలు వీరేనని గుర్తించాల్సింది ఎవరూ..? ఇలా నగ్నంగా విభూధి పూసుకుని, శ్మశానంలో తిరిగే వారంతా కూడా అఘౌరీలేనా అన్న విషయంపై స్పష్టత లేకుండాపోయింది. ఎక్కడో మంచు పర్వత ప్రాంతాలు, ప్రాశస్త్యం ఉన్న క్షేత్రల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో, నదులకు అవతలి ప్రాంతాల్లో మాత్రమే ఉంటారని ప్రతీతి. వీరు కేవలం కుంభమేళ, మహా కుంభమేళ వంటి సమయాల్లో మాత్రమే సంబంధిత నదుల వద్దకు వస్తారని ఇప్పటి వరకు విన్నాం. కానీ ప్రత్యేకంగా ఆలయాలను దర్శించుకునే సాంప్రాదాయం అత్యంత అరుదుగా వెలుగులోకి వస్తోంది. ఈ కారణంగానే అఘరా లేదా అఘౌరీలు ఎవరు, వారికి ఏ సమయంలో ఆలయాల్లో దర్శనానికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది, ఆగమ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అన్న అంశాలపై దేవాదాయ శాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

You cannot copy content of this page