కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం…
దిశ దశ, హైదరాబాద్:
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం స్పూర్తితో లోకసభ ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగురేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మెజార్టీ స్థానాల్లో గెలవాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్న కాంగ్రెస్ నాయకత్వం నియోజకవర్గ ఇంచార్జీలకు బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఎంపీలను ఎక్కువ సంఖ్యలో గెలిపించుకోవాలని పావులు కదుపుతున్న కాంగ్రెస్ అధిష్టానం ఇంఛార్జీల భుజస్కందాలపై లక్ష్యాన్ని నిర్దేశించినట్టు సమాచారం.
ఎంపిక మాత్రం…
అయితే లోకసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం కఠినంగానే వ్యవహరిస్తోంది. టికెట్ ఆశించిన వారితో పాటు స్థానిక నాయకత్వం సూచించిన వారిని ఎంపిక చేసే విషయంలో ఆచి తూచి అడుగేస్తోంది అయితే స్థానిక నాయకత్వం చెప్పినప్పటికీ చాలా చోట్ల వేరే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేందుకే మొగ్గు చూపింది. పెద్దపల్లి విషయమే చూసుకున్నట్టయితే ఈ లోకసభ పరిధిలోని ఐధుగురు సిట్టింగులు వ్యతిరేకించిన గడ్డం వంశీ అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపింది. అయితే ఇక్కడ ఎధురయిన వ్యతిరేకతను టికెట్ ప్రకటించిన తరువాత గడ్డం వంశీ తండ్రి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మంత్రాంగం నెరిపి ఎక్కువమంది సిట్టింగులను శాంతిపజేసుకున్నారు. దీంతో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీ ప్రచారంలో దూకుడు పెంచారు. వరంగల్, మల్కాజ్ గిరి, నిజామాబాద్, మెదక్, నల్గొండ, భువనగిరి తదితర చాలా చోట్ల కూడా అధిష్టానమే అభ్యర్థులను ఫైనల్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రకటించిన వారికి అనుకూలంగా ప్రచారం చేసి వారిని లోకసభకు పంపించే బాధ్యతలను మాత్రం ఇంఛార్జీలకు అప్పగించింది.
మెజార్టీ వస్తేనే…
అయితే సెగ్మెంట్ల వారిగా బాధ్యతలు అప్పగించిన అధిష్టానం ఏఏ సెగ్మెంట్లలో మెజార్టీ వస్తుందో ఆ ఇంఛార్జికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్న సంకేతాలను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తమ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు సాధించాలన్న పట్టుదలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు చూసుకోవల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఉందన్న నమ్మకంతో అధిష్టానం ఉంది. ఇందుకు ఇంఛార్జీల నేతృత్వంలో సమీకరణాలు చేసినట్టయితే సానుకూల ఫలితాలు వస్తాయన్న అంచనాతో కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. ఈ క్రమంలో మెజార్టీ వచ్చిన సెగ్మెంట్లలో ఓడిపోయిన వారు తమకు ముఖ్యమైన పదవి వరించే అవకాశం ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు. ఎక్కువ ఓట్లు సాధించినట్టయితే నామినేటెడ్ పోస్టు అయినా దక్కుతుందన్న ఆలోచనతో ఇంఛార్జీలు ఉన్నట్టు సమాచారం.