ముగ్గురు ‘ముకాస’లే

కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థుల తీరు

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ అసెంబ్లీ బరిలో ముగ్గురు మున్నూరు కాపు సంఘం(ముకాస) సామాజిక వర్గానికి చెందిన వారే ప్రత్యర్థులుగా నిలిచారు. ఒకప్పుడు అగ్రవర్ణ సామాజిక వర్గాలకు కెటాయించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించేవి. ఆ తరువాత బీసీ కార్డు నినాదంతో బీసీ అభ్యర్థులే బరిలో నిలుస్తున్నారు. తాజాగా జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో మాత్రం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ప్రజా క్షేత్రంలో తమ సత్తా ఏంటో చాటుకునేందుకు రంగంలోకి దిగారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే…

అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోటీ చేస్తున్నారు. కరీంనగర్ రికార్డును బ్రేక్ చేస్తూ ఇప్పటికే మూడు సార్లు గెలిచిన గంగుల కమలాకర్ బౌండరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. తాను చేసిన అభివృద్ది, అధికార బీఆర్ఎస్ పార్టీ పారించిన నిధుల వరదను చూసి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. అన్ని పార్టీలకన్నా ముందే గులాబి బాస్ అభ్యర్థులను ప్రకటించడంతో కరీంనగర్ క్యాండెట్ మంత్రి గంగుల కమలాకర్ దూకుడు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అన్ని సంఘాలను మచ్చిక చేసుకున్న గంగుల మరోసారి గెలిచి తన రికార్డును ఎవరూ బ్రేక్ చేయకూడదన్న సంకల్పంతో ముందుకు సాగతున్నారు.

టఫ్ ఫైట్ ఇచ్చి…

కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికలంటేనే టఫ్ ఫైట్ కు కేరాఫ్ గా నిలుస్తాయని చూపించిన ఘనత సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కే దక్కుతుంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ టఫ్ ఫైట్ ఇచ్చారు. కరీంనగర్ లో మైనార్టీల ఓట్లు కీలకంగా మారినప్పటికీ అవాంతరాలను అధిగమించే ప్రయత్నం చేశారు. దేశం కోసం ధర్మం కోసం అన్న నినాదాన్ని, హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. రెండు ఎన్నికల్లో ‘బండి’కి కరీంనగర్ ప్రజలు అండగా నిలబడలేదన్న విషయాన్ని గమనించిన ఏడు సెగ్మెంట్ల ఓటర్లు 2019 ఎన్నికల్లో అక్కున చేర్చుకుని ఎంపీగా గెలిపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన సంజయ్ ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్నారు. ముచ్చటగా మూడో సారి కరీంనగర్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న బండి సంజయ్ ఈ సారైనా అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

కొత్తగా… కొంగొత్తగా…

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ట్రయల్స్ చేస్తోందని స్పష్టం అయింది. స్థానికంగా ఉన్న బలమైన సామాజిక వర్గానికి చెందిన పురుమళ్ల శ్రీనివాస్ అభ్యర్థిత్వం ఖరారు చేసింది. అభ్యంతరాలు… ఫిర్యాదులు ఎన్ని వచ్చినా పట్టించుకోకుండా పురుమళ్ల శ్రీనివాస్ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. బొమ్మకల్ సర్పంచ్ గా శ్రీనివాస్ కాగా ఆయన భార్య కరీంనగర్ జడ్పీటీసీగా ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారి బరిలో నిలిచిన పురుమళ్ల శ్రీనివాస్ తన సత్తా చాటుకునేందుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అధికారికంగా అభ్యర్థి పేరు కాంగ్రెస్ పార్టీ ప్రకటించకున్నా శ్రీనివాస్ మాత్రం ప్రచార రథాలను తయారు చేసుకుని క్యాంపేన్ నిర్వహిస్తుండడం గమనార్హం. కరీంనగర్ నుండి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ పై ఉన్న మైనస్ పాయింట్లు అధిష్టానానికి చేరవేసినా పట్టించుకోకుండా ఆయన వైపే మొగ్గు చూపడం గమనార్హం.

ముగ్గురు… ముగ్గురే..

ఇక పోతే కరీంనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల చరిత్ర కరీంనగర్ ట్రాక్ రికార్డునే మార్చేసిందని చెప్పక తప్పదు. అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన వారి చేతుల్లో ఉన్న కరీంనగర్ బీసీల చేతుల్లోకి వెళ్లడమే ఒక ఎత్తు అయితే… ఈ సారి ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు బరిలో నిలుస్తుండడం సంచలనంగా మారింది. కరీంనగర్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అన్నది తేలాలంటే డిసెంబర్ 3 వరకూ ఆగాల్సిందే.

You cannot copy content of this page