అనుకున్నదొక్కటి… అయినది ఒక్కటి… బొల్తా కొట్టాడులే మన అభ్యర్థి…

దిశ దశ, హైదరాబాద్:

మైండ్ గేమ్స్ నాయకులవంతయితే… వారిని ఓ ఆటాడుకోవడం ప్రజల వంతు అన్నట్టుగా ఉంటుంది కదా… ప్రత్యర్థి పార్టీలు వీక్ అయితే ప్రజలంతా మనవైపే అనుకుని భ్రమల్లో బ్రతికే కొందరు అభ్యర్థులకు, ఆయా పార్టీల నాయకులకు ఈ ఎన్నికలు మాత్రం తగిన గుణపాఠం చెప్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని పార్టీల నాయకులను వెంటాడుతున్న ఈ సమస్య అధికార పార్టీ నేతలను మరింత ఇబ్బంది పెడతున్నట్టుగా ఉంది. జవాబుదారి తనాన్ని వీడి… ఆదిపత్యం చెలాయించే వ్యాఖ్యలు, మేం చెప్పిందే వేదంలా నడవాలనుకున్నట్టుగా వ్యవహరించిన తీరును సునిశితంగా పరిశీలించిన ఓటర్లు ఎన్నికల సమయంలో ఎలా వ్యవహరించాలోనన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో జరుగుతున్న చర్చతో ముడిపడి ఉన్న కొన్ని అంశాలను గమనిస్తే ఈ నిజాన్ని అన్నీ పార్టీలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మేం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ఎత్తులను పక్కన పెట్టేసి ప్రత్యర్థి పార్టీలు, తమపై పోటీ చేసే వారు ఉన్నతంగా ఎదగకుండా ఉంటే చాలు ప్రజలు తమ వెంటే నడుస్తారన్న భ్రమల్లో కాలం వెల్లదీసిన వారికి ప్రచారంలో ఎదురవుతున్న ఇబ్బందులు చుక్కలు చూపిస్తున్నాయన్నది వాస్తవం. గత చరిత్రను మరిచిపోయిన నేటితరం నేతలు భ్రమల్లో బ్రతికారు కానీ ఓటర్లు మాత్రం కాదన్న విషయం కదనరంగంలోకి దూకిన తరువాత అర్థం కాలేదు.

చక్ర బంధంలో కొందరు…

ఇక పోతే అప్రతిహతంగా గెలుపును అందుకుంటూ పోతున్న నేతల చుట్టూ వలయంగా ఏర్పడిన చక్ర బంధం కూడా వారికి… సామాన్యులకు మధ్య అంతరం ఏర్పర్చింది. వరస విజయాలతో అధికార దర్పంతో వెలిగిపోతున్నామన్న భావనకు వచ్చిన ప్రజా ప్రతినిధిలు తమ చుట్టు ఏర్పడింది సెక్యూరిటీ జోన్ అనుకుని భ్రమల్లో పడిపోయారు. దీంతో ఓటర్లు పుచిక పుల్లల్లా కనిపించిన నాయకులు ప్రజా క్షేత్రంలోకి వెల్లిన తరువాత కానీ అసలు వాస్తవాలు గుర్తించలేకపోయారు. ఇప్పటికీ కొంతమంది అభ్యర్థులు తమ చుట్టూ ఉన్న వారంతా రక్షణ కవచం లాంటి వారేనన్న ధీమాతో కాలం వెల్లదీస్తూ ఇంకా సామాన్యులకు కమ్యూనికేట్ కాకుండా ఉండేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చలు సాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ సీనియర్ ఎమ్మెల్యే తనపై పోటీ చేస్తారని భావించిన ఓ నాయకురాలికి అధికార యంత్రాంగంతో తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారట. ఈ విషయంతో సదరు నాయకురాలు పోటీకి దూరమై పోయినా ఓ మహిళా అనే విషయాన్ని విస్మరించి, గతంలో తనకు బాసటగా నిలిచిందన్న అంశాన్ని పట్టించుకోకుండా వ్యవహరించిన తీరు ఆ నోటా ఈ నోట ప్రజల మధ్య నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. మరో వైపున ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో ముఖ్య నేత కూడా ‘ఎం’ బ్యాచ్ చక్రబంధంలో చిక్కుకపోయారని ఆయన పార్టీ వర్గాలే అంటున్నాయి. ఈ బ్యాచ్ చెప్పినట్టే నడుచుకుంటే తాను సక్సెస్ అవుతానన్న అతి నమ్మకంతో సదరు అభ్యర్థి వ్యవహరిస్తున్న తీరు మాత్రం పార్టీ వర్గాల్లోనే చర్చకు దారి తీస్తోంది. కొంతమంది అభ్యర్థుల చుట్టూ జర్నలిస్టులు, ఆ ముసుగులో బ్రతుకున్న వారు కూడా అల్లుకపోయి ఇతరులను కలవనీయకుండా చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తాము గీసిన గీత దాటి ఇతర జర్నలిస్టులను కలిస్తే బావుండదన్న భ్రమల్లో అభ్యర్థులను ఉంచేసి అన్ని వర్గాల వారికి కమ్యునికేషన్ గ్యాప్ పెంచేశారని అంటున్నారు కొందరు. దీంతో సదరు అభ్యర్థికి వ్యతిరేకంగా సమాజంలో జరిగిన చర్చ ప్రభావం అంతా కూడా ఇప్పుడు ప్రాక్టికల్ గా కనిపిస్తోంది. తన నియోజకవర్గంలో అలవోకగా గెలవాల్సిన ఓ ముఖ్య నేత గెలుపు మాత్రం సునాయసం కాదని నిఘా వర్గాలు నివేదికలు ఇచ్చాయి. ఇందుకు కారణం తనను అట్టిపెట్టుకున్న పీఏలు, తన సామాజిక వర్గానికి చెందిన నేతల వల్ల ప్రజా క్షేత్రంలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ అధినేత కుటుంబానికి అత్యంత విధేయుడిని కాబట్టి తానేం చేసినా చెల్లుతుందన్న భావనతో తన నియోజకవర్గ ప్రజలతో మమేకం కావడాన్ని పక్కన పెట్టి అధికార దర్పాన్ని ప్రదర్శించిన ఓ అభ్యర్థి ఓటర్ల దగ్గరుకు వెల్లేసరికి ఎదురీదుతున్న విషయాన్ని స్వయంగా ఆయనే గుర్తించారు. ఉత్తర తెలంగాణాకు గుండెకాయగా ఉన్న మరో జిల్లాలోని మరో అభ్యర్థి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. మండలానికి చెందిన నాయకుడు చెప్తే వినడం.. ఇష్టారీతిన వ్యవహరించిన తీరుపై ఇప్పుడు అక్కడి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారన్న విషయాన్ని ఇంటలీజెన్స్ వర్గాలు గుర్తించాయి. తప్పుడు కేసులు పెట్టించిన తీరుతో పాటు ఓ ఫ్యాక్టరీ విషయంలోనూ జరిగిన రచ్చ కూడా ఆ అభ్యర్థి మెడకు ఉచ్చులా బిగుసుకపోయిందని కూడా ఆ నివేదికల సారాంశం. ప్రత్యర్థి పార్టీ ఉండకూడదన్న భ్రమల్లో అధిష్టానం పెద్దలు కూడా ఉండడం కూడా మరో కారణమన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను మట్టి కరిపించాలన్న లక్ష్యంతో ముందుకు సాగిన తీరుపై కూడా ఓ వర్గంలో వ్యతిరేకమైన అభిప్రాయాలు ఎదురయ్యాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్కటా రెండా ప్రతి చోట కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు మిలాఖత్ అయ్యారన్న విషయాన్ని కూడా గమనించిన ఓటర్లు ప్రత్యామ్నాయ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారన్న కారణాలు కూడా ఉన్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి.

You cannot copy content of this page