నాణ్యత ప్రమాణాలు పాటించారా..? క్వాలిటీ కంట్రోల్ విభాగం పరిశీలించిందా..?

ఓడెడు మానేరు వంతెన తీరుపై సాగుతున్న చర్చ

దిశ దశ, మంథని:

నీటి ప్రవహాన్ని తట్టుకునే సామర్థ్యం… ఇసుకలోనూ కుంగుబాటుకు గురి కాకుండా స్థిరంగా ఉండాల్సిన పిల్లర్లు, అంచనాలకు మించిన బరువులను మోయగలిగే విధంగా నిర్మించాల్సిన ఆ వంతెన ఎందుకిలా అవుతోంది..? ఇప్పటికే రెండు వైపుల గడ్డర్లు కుప్పకూలిపోగా… మరిన్ని ప్రాంతాల్లోనూ కుంగిపోతున్న తీరు ఇంజనీరింగ్ అధికారుల పనితీరుకే సవాల్ గా మారింది. సాంకేతికతతో పాటు నిర్మాణంలో పకడ్భందీగా క్వాలిటీని మెయింటెన్ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఎందుకు వస్తోందన్నదే ప్రశ్నార్థకంగా మారింది.

రూ. 49 కోట్లు..!

దూరాబారం తగ్గించేందుకు, రవాణా సౌకర్యాలను మెరుగు పర్చేందుకు 2016లో పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడెడు మానేరు నదిపై వంతెన నిర్మించేందుకు నిధులు మంజూరు అయ్యాయి. రూ. 49 కోట్లు ప్రభుత్వం కెటాయించగా టెండర్ ద్వారా ఈ వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే గడ్డర్లు వేసిన తరువాత ఈ వంతెన కోసం కెటాయించిన నిధులు చాలలేదన్న కారణంగా కాంట్రాక్టర్ అర్థాంతరంగా పనులను వదిలేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వంతెన అధికార యంత్రాంగం పనితీరుకు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ఇక్కడ నిధులు చాలవన్న విషయం గురించి గడ్డర్లు వేసేంత వరకూ గుర్తించకపోవడం ఏంటన్నదే పజిల్ గా మారింది. వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వచ్చే వరద నీటి ప్రవాహంతో స్థానికులు భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి ప్రాంతానికి చేరుకోవాలంటే పెద్దపల్లి లేదా, భూపాలపల్లి మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అంతేకాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా ఈ వంతెన మీదుగా తక్కువ సమయంలో గమ్యం చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ వంతెన నిర్మాణంతో తమ కష్టాలు తప్పనున్నాయని స్థానికులు సంబరిపడిపోయినప్పటికీ అర్థాంతర నిర్మాణంతోనే వదిలేసిన వంతెన ఈ ప్రాంత వాసుల కలలకు బ్రేకులు వేసింది. దీంతో మానేరు వంతెన పూర్తి చేయించాలంటూ స్థానికులు చేసుకున్న అభ్యర్థనలను పట్టించుకునే వారే లేకుండా పోయారు. గత ఏప్రిల్ 22న, జులై 2న ఈ వంతెన గడ్డర్లు కుప్ప కులిపోవడం ఒకటైతే, 17వ పిల్లర్ నుండి గర్మిళ్లపల్లి వైపునకు నిర్మించిన వంతెన గడ్డర్లు కూడా వంగిపోయాయి. దీంతో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందా లేదా అన్న సంశయం కొట్టుమిట్టాడుతోంది.

కారణమేంటీ..?

మానేరు నదిపై నిర్మించిన ఈ వంతెన విషయంలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. సంబంధిత శాఖ అదికారులు కూడా కాంట్రాక్టు పొందిన ఏజెన్సీకి స్టేజ్ వైజ్ బిల్లులను చెల్లిస్తారు. క్వాలిటీ కంట్రోల్ విభాగం అప్రూవల్ అయిన తరువాతే ఈ బిల్లులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే నిపుణుల పర్యవేక్షణలో జరిగిన ఈ వంతెనకు సంబంధించిన గడ్డర్లను కాంట్రాక్టు ఏజెన్సీ సైట్ సమీపంలోని తయారు చేస్తుంది. వీటిని తయారు చేసేందుకు ఉపయోగించే మెటిరియల్ క్వాలిటీ, క్వాంటీటిని క్షుణ్ణంగా పరిశీలించడం, క్యూరింగ్ చేయడం, స్టీల్, సిమెంట్, కాంక్రీట్ ఎస్టిమేట్ ప్రకారమే వినియోగించారా అన్న వివరాలను తెలుసుకుని, ప్రత్యక్ష్యంగా పర్యవేక్షించి, ఆమోద ముద్ర వేసిన తరువాతే గడ్డర్లను వంతెనపై బిగించాల్సి ఉంటుంది. పిల్లర్ కు పిల్లర్ కు మధ్య వదిలేసిన స్థలం ఎంత..? పిల్లర్లపై గడ్డర్లు బిగించేందుకు రెండు వైపులా సమాన దూరంలో ఏర్పాటు చేశారా..? బేరింగులు బ్యాలెన్స్ మెయింటెన్ చేసే విధంగా ఉంచారా తదితర అంశాలన్నింటిని ఇంజనీర్లు పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఓడెడు మానేరు వంతెన వద్ద నిర్మించిన ఈ వంతెనపై వేసిన గడ్డర్లు ఏనిమిదేళ్లలోగానే కుంగిపోవడానికి కారణం ఏంటన్న విషయంపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇందుకోసం వాడిన స్టీల్ సైజ్, మెటల్ సైజ్, సిమెంట్ గ్రేడ్ ఎస్టిమేట్లలో వెల్లడించిన విధంగానే కాంట్రాక్టు ఏజెన్సీ వినియోగించిందా లేక తక్కువ పరిణామంలో ఉన్న మెటిరియల్ ను వినియోగించిందా అన్న విషయంపై స్పష్టత రావల్సి ఉంది. అంతేకాకుండా క్యూరింగ్ ఎన్ని రోజుల పాటు చేశారు..? కాంక్రీట్ అంతా గట్టిపడిన తర్వాతే గడ్డర్లను వినియోగించారా అన్న విషయంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ 22న గడ్డర్లు కూలిపోయిన తరువాత కాంట్రాక్టు ఏజెన్సీని బ్లాకులో లిస్టులో పెడుతున్నారన్న ప్రచారం అయితే జరిగింది. కానీ ఇక్కడ కాంట్రాక్టు ఏజెన్సీ నిబంధనలకు తిలోదకాలిచ్చినా కట్టడి చేయడంలో విఫలం అయిన అదికారుల తీరుపై కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page