జగిత్యాల జిల్లాలో పదో తరగతి స్టూడెంట్స్ నిరసన
దిశ దశ, జగిత్యాల:
అసలే పదో తరగతి చదువుతున్న విద్యార్థులు వారంతా… జీపీఏ ఎక్కువ సాధిస్తేనే తమ భవిష్యత్తు బావుటుందని అనుకుంటున్నారు… ఇందు కోసం అటు బడిలో ఇటు ఇంట్లో చదువకునేందుకే ఎక్కువ సమయం కెటాయిస్తున్నారు… అయితే మెరిట్ పొందాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న వారికి ఆర్టీసీ బస్సు అశనిపాతంగా మారింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వెంకట్రావుపేట ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న స్టూడెంట్స్ ఇంటికి చేరుకునేందుకు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. వెంకట్రావుపేట, ఒడ్యాడ్ రూట్ లో నడిపే ఆర్టీసీ బస్సు రోజూ సాయత్రం వేళల్లో ఆలస్యంగా వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం స్కూలుకు వచ్చేప్పుడు సకాలంలోనే బస్సు నడుస్తున్నా సాయంత్రం మాత్రం ఆలస్యంగా వస్తోందని అవేదన వ్యక్తం చేశారు. 4.15 నిమిషాలకు స్కూల్ సమయం ముగిసిపోతున్నప్పటికీ ఆర్టీసీ బస్సు మాత్రం సాయంత్రం 6 గంటల వరకూ రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము ఇంటికి చేరే వరకు రాత్రి అవుతోందని, ఆ సమయంలో చదువుకునే పరిస్థితి లేకుండా పోతోందని అంటున్నారు. గంటన్నరకు పైగా బస్సు కోసం ఎదురు చూస్తున్న తాము ఇంటికి చేరుకున్న తరువాత శ్రద్ద పెట్టి చదువలేకపోతున్నామని వివరించారు. ఆర్టీసీ బస్సు వేళలను మార్చేందుకు అధికారులు చొరవ తీసుకోనట్టయితే తమ చదువులపై తీవ్రమైన ప్రభావం పడుతుందని వెంకట్రావుపేట హైస్కూల్ స్టూడెంట్స్ ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. 4.30 గంటల ప్రాంతంలో బస్సు వచ్చినట్టయితే త్వరగా ఇంటికి చేరుకుని హోమ్ వర్క్ చేసుకోవడంతో పాటు ఆయా సబ్జెక్టులను చదువుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకుని వెంకట్రావుపేట, ఒడ్యాడ్ బస్సు వేళలు మార్చి తమ భవిష్యత్త మార్గానికి సుగమం చేయాలని కోరుతున్నారు. బస్సు వేళలు మార్చాలని కోరుతూ శనివారం విద్యార్థులు బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన కూడా తెలిపారు. ప్ల కార్డులు పట్టుకుని నినాదాలు ఇచ్చిన స్టూడెంట్స్ బస్సు వేళలు మార్చేందుకు ఆర్టీసీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేనట్టయితే తమ చదువులు సాఫీగా జరిగే అవకాశం లేదని, దీంతో మెరిట్ సాధించలేకపోతామని వారు అంటున్నారు. ఆర్టీసీ అధికారులు విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని బస్సు వేళలను మార్చినట్టయితే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.