ఎలక్ట్రానికి డివైజ్ ఇచ్చా… అమౌంట్ తీసుకోలే…

వెలుగులోకి వచ్చిన మరో వ్యవహారం

డీఈ రమేష్ విచారణలో బయటపడుతున్న నిజం

దిశ దశ, హైదరాబాద్:

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తవ్వినాకొద్ది అసలు నిజాలు బయటపడుతున్నట్టు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ వ్యవహారంలో చాలా సీరియస్ గా విచారణ చేస్తోంది. దీంతో పుట్టలో ఉన్న ఒక్కోక్కరూ బయటకు వస్తుండగా, విచారణలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యోగం కోసం తప్పుదారి ఎంచుకున్న వారికి ముందే పేపర్లు ఇచ్చానని డీఈ రమేష్ సిట్ విచారణలో వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఆరు రోజుల కస్టడికి తీసుకున్న సిట్ రమేష్ ను విచారించిన కొద్ది వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఏ2 నిందితుడు రాజశేఖర్ రెడ్డి పేరు మాత్రమే ఈ వ్యవహారంలో వెలుగులోకి రాగా డీఈ రమేష్ ఎంక్వైరీలో మరింతమంది గుట్టు రట్టవుతోంది. తాజాగా కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు తన కూతురు రాస్తున్న ఏఈ ఎగ్జామ్ కోసం తనతో డీల్ కుదుర్చుకున్నట్టుగా డీఈ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో కరీంనగర్ వాసి పేరు తెరపైకి రావడం సంచనలంగా మారింది. అయితే ఈ డీల్ లో రూ. 75 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం జరగగా ఇందుకు సంబంధించిన డబ్బులు మాత్రం ఉద్యోగం వచ్చిన తరువాతే చెల్లిస్తానని మాజీ ఎంపీటీసీ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఎగ్జామ్ జరిగే నెల రోజుల ముందు వీరిద్దరూ కలుసుకుని అన్ని ఒప్పందాలు చేసుకున్న తరువాత పరీక్షకు ముందే సదరు మాజీ ఎంపీటీసీకి ఎలక్ట్రానికి డివైజ్ ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు.

అప్పుడే ప్రచారం…

అయితే బొమ్మకల్ కు చెందిన ఒకరు పేపర్ లీకేజీ చేసుకుని ఎగ్జామ్ కు అటెండ్ అయినట్టుగా పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడే ప్రచారం జరిగింది. అయితే వీరు నిందితుడు రాజశేఖర్ రెడ్డికి బంధువులని కూడా ప్రచారం జరగడంతో ఆ వివరాల గురించి ఆరా తీసినప్పటికి బయటకు పొక్కలేదు. దీంతో అదంతా వట్టి ప్రచారమేనని భావించారంతా. అనూహ్యంగా డీఈ రమేష్ ను సిట్ కస్టడిలోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

ఇంకెందరో…?

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ద్వారా లబ్ది పొందిన వారు ఇంకెందరు ఉన్నారోనన్న చర్చ కరీంనగర్ లో మొదలైంది. ఈ వ్యవహారంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో ఆరా తీసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాసిన వారి వివరాలను సేకరించి వారి గురించి కూడా పూర్తిగా విచారిస్తున్నట్టు సమాచారం. మరో వైపున అరెస్ట్ అయిన మిగతా వారిని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం కూడా ఉండనుంది. డీఈ రమేష్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరిన్ని కోణాల్లో సిట్ దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త పేర్లు వెలుగులోకి వస్తుండడంతో ఎగ్జామ్స్ రాసిన వారికి డీఈకి ఎలా పరిచయం ఏర్పడింది..? మధ్యలో ఎవరైనా ఉన్నారా అన్న కోణంలోనూ సిట్ విచారించనున్నట్టు సమాచారం.

You cannot copy content of this page