మృత్యువు వెంటాడిందా..? రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే దుర్మరణం

దిశ దశ, హైదరాబాద్:

రోడ్డు ప్రమాదం రూపంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం చెందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె తన తండ్రి సాయన్న వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చారు. పటాన్ చెరూ సమీపంలోని సుల్తాన్ పూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టడంతో లాస్య నందిత అక్కడికక్కడే మృత్యువాత పడగా డ్రైవర్ తో పటు పీఏ ఆకాష్ లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.

వెంటాడిన మృత్యువు…

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యువు వెంటాడిందా అంటూ అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఓ సారిలి లిఫ్ట్ లో చిక్కుకున్న లాస్య నందిత ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఈ నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభకు హాజరై లాస్య నందిత తిరిగి వస్తున్నారు. నార్కట్ పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆటోను ఢీకొట్టిన ఘటనలో లాస్య నందిత స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదృష్టవశాత్తు భారీ ప్రమాదం తప్పిందని కూడా అభిమానలు సంతోషపడ్డారు. అయితే మృత్యువు వారి సంతోషాన్ని ఎంతో కాలం నిలపలదేు. చెర్లపల్లి రోడ్డు ప్రమాదం జరిగిన పదిరోజుల్లోనే ఆమె రోడ్డు ప్రమాదంలోనే చనిపోవడం విషాదాన్ని నింపింది. యువ ఎమ్మెల్యేను మృత్యువు వెంటాడి ప్రాణాలను బలి తీసుకుంది. లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడాన్ని అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఫిబ్రవరిలోనే…

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న 2023 ఫిబ్రవరి 19న మరణించారు. అనారోగ్యంతో ఉన్న సాయన్న గత సంవత్సరం మృతి చెందడంతో ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న లాస్యనందితకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టిన ఆమె తన తండ్రి మరణించిన నెలలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువు ఒడిలో చేరడం విచారకరం. సాయన్న గత ఫిబ్రవరి 19న మరణించగా లాస్య నందితను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఫిబ్రవరి 23నే కబళించడం విషాదాన్ని నింపింది.

You cannot copy content of this page