మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా బీజేపీ నేత, పంబాజ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నియమితులయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోషియారి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భగత్ సింగ్ కొషియార్ స్థానాన్ని కెప్టెన్ అమరీందర్‌తో భర్తీ చేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
మహారాష్ట్ర గవర్నర్‌గా కోషియారి సెప్టెంబర్ 2019లో బాధ్యతలు చేపట్టారు. అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెల్లవారుజామునే ప్రమాణ స్వీకారం చేయించడం మొదలు, మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తిరస్కరించడం వంటి ఘటనలతో విపక్షాల విమర్శలకు గురయ్యారు. కొషియారి తన పదవీకాలంలో పలుసార్లు విపక్షాల నేతల విమర్శలు, రాజీనామా చేయాలన్న డిమాండ్లను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలని నిశ్చయించుకున్నారు.
ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు రాజకీయ బాధ్యతల నుంచి తనకు విముక్తి కల్పించాలని కోరానని కొషియారి తెలిపారు. తన చేతిలో మిగిలిన సమయాన్ని పుస్తకాలు చదవడం, రాయడం, ఇతర కార్యక్రమాలపై వెచ్చించాలని కోరుకుంటున్నట్టు తెలియజేశానని చెప్పారు. తన పట్ల ప్రధాని ఎప్పుడూ ఎంతో ఆదరాభిమానాలు కనబరిచేవారని, తన విజ్ఞప్తిని అంగీకరిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.
కాగా, కెప్టెన్ అమరీందర్ సింగ్ 2021 నవంబర్‌లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ నియామకానికి నిరసనగా ఆయన పార్టీని వీడారు. అనంతరం సొంతంగా ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పార్టీని స్థాపించి గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. కాగా, గత సెప్టెంబర్‌లో తన పార్టీని ఆయన బీజేపీలో విలీనం చేశారు. దీంతో తదుపరి మహారాష్ట్ర గవర్నర్‌గా అమరీందర్ సింగ్‌ను నియమించే అవకాశాలున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.