దిశ దశ, చెన్నై:
చెన్నైలోని ఓ బ్యాంకు అధికారుల చర్యల వల్ల కొద్దిసేపు ఓ కారు డ్రైవర్ రూ. 9 వేల కోట్లకు అధిపతి అయ్యాడు. అసలు విషయం గమనించిన బ్యాంకు అధికారులు రాజ్ కుమార్ అకౌంట్ నుండి డబ్బును తిరిగి బదిలీ చేసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న రాజ్ కుమార్ మొబైల్ కు ఈ నెల9న ఓ మెసేజ్ వచ్చింది. తమిళనాడు మార్కెంటైల్ బ్యాంకు నుండి వచ్చిన ఈ మెసేజ్ సారాంశం చూసి రాజ్ కుమార్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అతని అకౌంట్లో రూ. 9 వేల కోట్లు జమయ్యాయని మెసేజ్ వచ్చింది. అనుమానంతో మెసేజ్ ను ఒకటికి రెండు సార్లు చదువుకున్నాడు. అయినప్పటికీ తనలోని అనుమానం తీరకపోవడంతో తన స్నేహితుడికి రూ. 21 వేలు బదిలీ చేయగా అవి అతని అకౌంట్లో జమ అయ్యాయి. అయితే బ్యాంక్ అధికారులు రాజ్ కుమార్ కు ఫోన్ చేసి పొరపాటును రూ. 9 వేల కోట్ల మీ అకౌంట్ కు బదిలీ అయ్యాయని నగదు మొత్తాన్ని తిరిగి అప్పగించాలని కోరారు. దీంతో రాజ్ కుమార్ న్యాయవాదుల ద్వారా బ్యాంకు అధికారులను సంప్రదించాడు. రూ. 21 వేలు తిరిగి ఇవ్వాల్సిన పని లేదని, రాజ్ కుమార్ కు రుణంపై వాహనం కూడా ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో కథ సుఖాంతం అయింది.