వైద్యుల విశ్వసనీయతకు సవాల్… మంచిర్యాల ఘటనతో మార్పు వచ్చేనా..?

దిశ దశ, కరీంనగర్:

వ్యాపార దృక్ఫథంతో సాగుతున్న వైద్యులకు కనువిప్పు కల్గించే ఘటన ఇది. ఎవరికి పడితే వారికి కమిషన్లు ఎరగా వేసి వృత్తిని కాస్తా వ్యాపారంగా మార్చిన కొంతమంది తీరుకు ప్రత్యక్ష్య ఉదాహారాణ. వైద్యో నారాయణ హరి అన్న నానుడికే సవాల్ విసురుతున్నట్టుగా సాగిన ఈ ఘటనలో ఓ అంబూలెన్స్ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహాకులు ధన దాహం కోసం కక్కుర్తి పడుతున్న తీరుకు దర్పణం పడుతోంది ఈ ఘటన. మంచిర్యాల పోలీసులు ఓ అంబూలెన్స్ డ్రైవర్ ను అరెస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

ఇంతకీ ఏం జరిగిందంటే..

మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సింధూజ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు సూచించడంతో అమెను వేరే ఆసుపత్రికి తరలించేందుకు TS02UD 8480 డ్రైవర్ కం ఓనర్ ను సంప్రదించారు. అయితే మ్యాదరి సింధూజ బంధువులు చెప్పిన చోటకు కాకుండా పట్టణంలోని మరో ప్రైవేటు హస్పిటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స అందిస్తున్న క్రమంలో సింధూజ ఆరోగ్య పరిస్థితి విషమించిందని చెప్పడంతో ఆమెను కరీంనగర్ లోని తమకు తెలిసిన ఓ ఆసుపత్రికి తరలించాలని పేషెంట్ బంధువులు సూచించారు. అయితే సదరు అంబూలెన్స్ డ్రైవర్ వారి మాట వినకుండా మరో ఆసుపత్రికి సింధూజాను తరలించి 20 నుండి 40 నిమిషాల పాటు వెయిట్ చేయించాడు. డాక్టర్  వచ్చి వైద్యం అందించకపోవడంతో సింధూజ ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని ఆందోళన చెందిన ఆమె బంధువులు ముందుగా తాము చెప్పిన ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరడంతో అప్పుడు సదరు ఆసుపత్రికి తరలించారు. సింధూజకు చికిత్స అందిస్తున్న క్రమంలో బ్రెయిన్ డెడ్ అయిందని, 30 నిమిషాల ముందు వచ్చినట్టయితే ఆమెను రక్షించే వారిమని అక్కడి వైద్యులు చెప్పారు. మార్చి 29న జరిగిన ఈ సంఘటన అనంతరం సింధూజను తిరిగి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఏప్రిల్ 1న ఆమె మరణించడంతో బంధువులు మంచిర్యాల పోలీసులను ఆశ్రయించి తమ గోడు వెల్లబోసుకోవడంతో సదరు అంబూలెన్స్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.

కమిషన్ల కోసం…

అయితే అంబూలెన్స్ డ్రైవర్ కు కరీంనగర్ చెందిన సదరు ఆసుపత్రి యాజమాన్యం 25 నుండి 30 శాతం వరకు కమిషన్ ఇచ్చేందుకు అంబూలెన్స్ డ్రైవర్ తో ఒప్పందం చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. అంబూలెన్స్ డ్రైవర్ తన కమిషన్ కోసం పేషెంట్లు చెప్పిన చోటకు కాకుండా వేరే ఆసుపత్రికి తరలించడం అక్కడ సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే సింధూజ బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిందని మంచిర్యాల ఏసీపీ రత్నాపురం ప్రకాష్ తెలిపారు. అంబూలెన్స్ డ్రైవర్ తన కమిషన్ కోసం ఇలా వ్యవహరించడం వల్లే అమాయకురాలు మృతి చెందిందని నిందితునిపై కేసు నమోదు చేశామని వివరించారు.

వృత్తికే కళంకమా..?

అయితే మంచిర్యాల పోలీసులు అంబూలెన్స్ డ్రైవర్ ను అరెస్ట్ చేసిన ఘటన వ్యాపార ధృక్ఫథంతో వ్యవహరిస్తున్న వైద్యుల తీరును, ఆసుపత్రి నిర్వాహకుల తప్పిదాలను కూడా ఎత్తి చూపుతోంది. పేషెంట్లను తరలించేందుకు అంబూలెన్స్ డ్రైవర్ కు కమిషన్ ఇచ్చేందుకు సాహసించడం ఏంటన్నదే మిస్టరీగా మారింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రోగులకు చకాచకా చికిత్స అందించాల్సింది పోయి ప్రొఫేషన్ తో ఏ మాత్రం సంబంధం లేని వారికి కమిషన్లు ఎరగా వేయడం వెనక ఆంతర్యం ఏంటీ..? అన్న విషయంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మంచిర్యాల పోలీసులు నమోదు చేసిన కేసును ఆధారం చేసుకుని విచారణ జరిపిస్తే వ్యాపార ధోరణితో ముందుకు సాగుతున్న ప్రైవేటు వైద్య శాలలో బాగోతం బట్టబయలు అవుతుంది.

You cannot copy content of this page