బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు…

దిశ దశ, హైదరాబాద్:

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆ మాజీ ఎమ్మెల్యేను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఓ వైపున తన ఇలాకాలో ఆర్టీసీ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ ను క్లోజ్ చేయగా మరో వైపున భూమి దురాక్రమణకు సంబంధించిన కేసు నమోదు అయింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులపై రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కేసు నమోదైంది. సామ దామోదర్ రెడ్డికి చెందిన భూమిని కబ్జా చేశారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్లపల్లి శివారల్లో సామ దామోదర్ రెడ్డి 20 ఎకరాల 20 గుంటల స్థలాన్ని 2022లో కొనుగోలు చేశారు. 32, 35, 36, 38 సర్వే నెంబర్లలోని భూమిలో ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నారు దామోదర్ రెడ్డి. అయితే ఈ స్థలాన్ని ఆనుకుని జీవన్ రెడ్డికి భూమి ఉండడంతో 2023లో తన ఫంక్షన్ హాల్ ను కూల్చివేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగును ఏర్పాటు చేసుకుని ఫంక్షన్ హాల్ ను కూల్చేస్తున్నారని తెలుసుకుని తాను అక్కడకు చేరుకున్నానని వివరించారు. అయితే తనపై దాడికి పాల్పడడంతో పాటు పంజాబీ గ్యాంగు మారణాయుధాలు చూపించి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఆశన్నగారి జీవన్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులపై ఐపీసీ 447, 427, 341, 386, 420, 506 r/w 34 ఐపీసీ సెక్షన్లలో పోలీసులు కేసు నమోదు చేశారు.

You cannot copy content of this page