బీఆర్ఎస్ నాయకులను వెంటాడుతున్న తప్పిదాలు…

గంగుల అనుచరులకు ఏమైంది..?

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కేసులు వెంటాడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలు ఇప్పుడు అరెస్టులకు కారణం అవుతున్నాయి. కరీంనగర్ సీపీగా అభిషేక్ మహంతి బాధ్యతలు తీసుకున్న తరువాత వస్తున్న పిటిషన్ల వెల్లువలో సింహభాగం గులాభి పార్టీకి చెందిన వారివే కావడం సంచలనంగా మారుతోంది. వరస కేసుల పరంపర ఆగినట్టే ఆగినా తిరిగి మొదలు కావడంతో తప్పటడుగులు వేసిన వారిలో ఆందోళన మొదలైంది. కరీంనగర్ పరిధిలో సాగుతున్న ఈ కేసుల తీరు బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి.

అన్నింటా వారే…

ఇప్పటి వరకు కేసుల నమోదయిన చాలా కేసుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీతో అనుబంధం పెనవేసుకున్నవారే కావడం గమనార్హం. కరీంనగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని భూ వ్యవహారాలకు సంబంధించిన కేసుల్లో గులాభి పార్టీ నాయకుల ప్రమేయం వెలుగులోకి వస్తున్న తీరు పార్టీ నాయకత్వానికి కూడా తలనొ్ప్పిగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసు కేసుల్లో ఉన్నవారు బెయిలుపై బయటకు రాగా తాజాగా మరో ముఖ్య నాయకుడు అరెస్ట్ కావడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా, సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న చిట్టుమళ్ల శ్రీనివాస్ అరెస్ట్ రాజకీయ వర్గాలతో పాటు వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది. భూ వివాదాల్లో తలదూర్చడమే కాకుండా ఇష్టారీతిన వ్యవహరించారని ప్రజల్లో జరుగుతున్న గుసగుసలకు తోడు ఈ కేసుల పరంపర బీఆర్ఎస్ పార్టీని పుట్టిముంచుతున్నాయన్నది వాస్తవం. భూ సంబంధిత అంశాల్లో పోలీసులు జోక్యం చేసుకోరన్న ధీమాతో వ్యవహరించిన వారిని క్రిమినల్ కేసులు వెంటాడుతుండడంతో ఒక్కొక్కరి బాగోతాలు బయటకు వస్తున్నాయి. ఎకానమిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) ఏర్పాటు చేసిన సీపీ మహంతి బాధితుల అన్యాయం గురించి సమగ్రంగా ఆరా తీయిస్తున్నారు. డాక్యూమెంట్లను ఫోర్జరీ చేశారని, ఆర్థిక లావాదేవీల విషయంలో మోసాలకు పాల్పడ్డారన్న ఆధారాలు దొరకగానే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. గతంలో వరసగా ఇలాంటి కేసులు నమోదు కాగా ఇటీవల ఈఓడబ్లు కొంత నెమ్మదిగా ముందుకు సాగుతోంది. అయితే బాధితుల నుండి తీసుకున్న ఆస్తులను తిరిగి వారికి అప్పగించి కేసుల బారిన పడకుండా ఉండాలని చాలా మంది రహస్యంగా రాజీ పడుతున్నారు. దీంతో పరోక్షంగా అయినా బాధితులకు న్యాయం జరుగుతోందన్న కారణంతో పోలీసులు ఆచూతూచి వ్యవహరించారు. అయితే మరీ మూర్ఖంగా వ్యవహరించిన వారి విషయంలో మాత్రం వెనక్కి తగ్గవద్దని భావించి కేసులు పెట్టాలని అనుకుంటున్నట్టుగా సమాచారం. దీంతో మళ్లీ ఈఓడబ్లూ దూకుడును పెంచినట్టుగా తెలుస్తోంది. సేఫ్టీ కోసం పార్టీ మారినా కూడా తప్పుంటే అరెస్ట్ చేయడమే మా పని అన్నట్టుగా కరీంనగర్ పోలీసులు వ్యవహరిస్తుండడంతో కొంతమంది పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా సాగుతోంది.

కిమ్మనని అధిష్టానం…

రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు అయినప్పుడు అధినేత కేసీఆర్ కూడా స్పందించిన సందర్బాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సోషల్ మీడియా పోస్టులు పెట్టే వారిపై వేసిన కేసుల గురించే అయినా ఇతర అంశాలకు సంబంధించిన విషయాల్లో అయినా అధిష్టానం ఘాటుగానే స్పందిస్తోంది. కానీ కరీంనగర్ భూ మాఫియా కేసుల్లో మాత్రం ఇంతవరకూ బీఆర్ఎస్ అధిష్టానం అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తుండడం గమనార్హం. ఇప్పటి వరకు నమోదయిన కేసుల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఎక్కువ మంది అరెస్టు అయినప్పటికీ కూడా అగ్ర నాయత్వం మాత్రం పట్టించుకోనట్టుగానే ఉంటోంది. బాధితులు నమోదు చేస్తున్న కేసుల విషయంలో పోలీసులు ముందుకు సాగుతున్న తీరు కూడా ఇందుకు ఓ కారణమని చెప్పక తప్పదు. పకడ్భందీగా ఆధారాలు సేకరిస్తూ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తుండడం వల్ల ఏమీ అనలేని పరిస్థితులు తయారయ్యాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు చేసినా కరీంనగర్ ప్రజల నుండి వ్యతిరేకతను మూటగట్టుకోవల్సి వస్తుందన్న కారణం కూడా అయి ఉంటుదన్న వాదనలు కూడా లేకపోలేదు.

మళ్లీ మొదలైన దడ…

ఇకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ చిట్టుమళ్ల శ్రీనివాస్ అరెస్ట్ తో ఇప్పటి వరకు ఊపిరి పీల్చుకున్న భాదందాగాళ్లలో మళ్లీ దడ మొదలైంది. తాము చేసిన తప్పిదాల గురించి చెప్పుకునేందుకు బాధితులు కమిసనరేట్ మెట్లు ఎక్కకుండా చూసుకోవాలన్న తపన మళ్లీ మొదలైంది. ఇంతకాలం సీపీ మహంతి కూల్ అయ్యారు… ముఖ్య నాయకులతో పాటు ఉన్నాతాధికారుల నుండి ఒత్తిళ్ల వచ్చాయని ఘంటాపథంగా చెప్పుకున్న వారి నోళ్లను తాజా అరెస్ట్ మూయించినట్టయింది. దీంతో పోలీసులు తయారు చేసిన ఆ జాబితాలో తమ పేర్లు ఉన్నాయా తెలుసుకోవడం ఎలా అన్న పనిలో నిమగ్నం అయ్యారు భూ దందాగాళ్లు. కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల కారణంగా భూ వ్యవహారాల్లో తల దూర్చిన వారిలో కొంతమంది ఊరు వదిలి వెల్లిపో్యిన సంగతి కూడా తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితులమని చెప్పుకున్న ప్రచారం కూడా అంతా వట్టిదేనని… చట్టం తన పని తాను చేసుకుపోతోంది తప్ప మరో ఆలోచనకు తావివ్వదన్న రీతిలో కరీంనగర్ పోలీసులు వ్యవహరిస్తున్నారు.

పార్టీకి తలవంపులేనా…

వరస కేసుల తీరుతో ఉద్యమ పార్టీకి తలవంపులు తెచ్చినట్టుగా తయారైందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చుట్టాలుగా ఉన్న చట్టాలే ఇప్పుడు వెంటాడి వేటాడుతున్న తీరుతో గులాభి మయంగా ఉన్న కరీంనగర్ నేడు ఎదురీదే పరిస్థితికి చేరుకుంటోదన్న ఆందోళన పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. ఇంటా బయటా అన్ని చోట్ల కూడా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న తీరు… ఉద్యమానికి ఊపిరి పోసిన ఖిల్లా నుండే మొదలు కావడం మింగుడుపడకుండా తయారైంది.

You cannot copy content of this page