దిశ దశ, వరంగల్:
ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన ప్రభుత్వ యంత్రాంగంపై అవినీతి నిరోధక శాఖ కన్నెర్ర చేయడం మొదలుపెట్టింది. కొంతకాలంగా లంచం తీసుకునే వారిని మాత్రమే వేటాడిన తెలంగాణ ఏసీబీ తాజాగా అక్రమ ఆదాయం గడించిన వారిపై కూడా దృష్టి సారించినట్టుగా ఉంది. శుక్రవారం హన్మకొండలో అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించిన దాడులకు ఏసీబీ అధికారులు శ్రీకారం చుట్టారు. హన్మకొండ రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్ గా పని చేస్తున్న పుప్పాల శ్రీనివాస్ అద్దెకు ఉంటున్న ఇంటితో పాటు, జగిత్యాల, హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు గడించారన్న ఆరోపణలు నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నట్టుగా సమాచారం. కొంత కాలంగా తెలంగాణ ఏసీబీ ట్రాప్ కేసుల్లో అరెస్ట్ అయిన వారిపై మాత్రమే అక్రమ అస్థుల కేసులు నమోదు చేసేందుకు మొగ్గు చూపింది. డీటీసీ శ్రీనివాస్ ఇండ్లలో అసెట్స్ కేసులో దాడులు చేయడం ప్రారంభించడంతో అక్రమ ఆస్తులు గడించిన వారిపై కూడా దృష్టి సారించినట్టుగా స్పష్టం అవుతోంది.