దిశ దశ, న్యూ ఢిల్లీ:
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ అయ్యారు. ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టుగా సీబీఐ పేర్కొంది. ఇప్పటికే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసులో ఈడీ కవితను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కవితను విచారించేందుకు అనుమతించాలని కోర్టు అనుమతి తీసుకున్న సీబీఐ ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే క్రిమినల్ కేసుకు సంబంధించిన అంశంలో సీబీఐ అరెస్ట్ చేసి ఉంటుందని భావిస్తున్నారు. కోర్టు అనుమతితో విచారించిన సీబీఐ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. గత నెల 15న కవితను ఈడీ అరెస్ల్ చేయగా ఈ నెల 16న ఆమె బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగనుంది. ఈడీ కవితను కోర్టు అనుమతితో కస్టడీలో విచారించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతితో ఎంట్రీ ఇచ్చిన సీబీఐ తాజాగా అమెను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.
రెండు రోజుల్లోనే…
మంగళవారం కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరు పరిచారు. ఆమెను ఈ నెల 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజున కవిత రౌస్ ఎవెన్యూ కోర్టుకు నాలుగు పేజీల సుదీర్ఘమైన లేఖ కూడా రాశారు. తనకు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ రాసిన ఈ లేఖలో సీబీఐ గతంలోనే తనను విచారించిందన్న విషయాన్ని కూడా ఊటంకించారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల్లోనే సీబీఐ కవితను అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించడం సరికొత్త చర్చకు దారి తీసింది. అటు మనీ లాండరింగ్, ఇటు నేరానికి పాల్పడిన అంశాలకు సంబంధించిన కేసులు ఆమెపై నమోదు చేసినట్టుగా స్పష్టం అవుతోంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ, క్రిమినల్ చర్యల గురించి సీబీఐ కవితను నిందితురాలిగా పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో జాతీయ దర్యాప్తు సంస్థలు వేర్వేరుగా రంగంలోకి దిగినట్టు స్పష్టమవుతోంది.