వివేకా హత్య కేసులో సీబీ‘ఐ’ అరెస్టుల పర్వం

నిన్న ఉదయ్ కుమార్ రెడ్డి

నేడు భాస్కర్ రెడ్డిల అరెస్ట్

దిశ దశ, ఏపీ కరస్పాండెంట్:

వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండు రోజులుగా సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటి వరకు దర్యాప్తులో భాగంగా పలువురిని విచారించిన అధికారులు ఇప్పుడు ఏకంగా అరెస్టులు చేస్తుండడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి వివేకా హత్య కేసు వైపు మళ్లింది. ఇటీవల హైదరాబాద్ లో సీబీఐ ముందు విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానందపై పలు ఆరోపణలు చేశారు. ఆయన వేరే వివాహం చేసుకున్నారని మతం మారాలని కూడా భావింంచారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో వివేకా హత్య కేసు ఎటు వైపు మళ్లుతుందోనని భావించారంతా. కానీ సీబీఐ అధికారులు మాత్రం అవినాష్ రెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఆయనకు అత్యంత సన్నిహితులనే అరెస్ట్ చేస్తుండడం కలకలం సృష్టిస్తోంది. శనివారం అవినాష్ రెడ్డితో సన్నిహితంగా మెదిలే ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశించింది. ఆదివారం ఉదయం సీబీఐ అధికారులు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. దీంతో వివేకా హత్య కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందోనన్న చర్చ మొదలైంది. వివేకానంద హత్య కేసులో పులివెందుల డీఎస్సీ వాసుదేవన్ వాంగ్మూలం అత్యంత కీలకంగా మారిందని సీబీఐ చర్యలను బట్టి స్పష్టమవుంతోంది. వివేకా హత్య కేసు గురించి ఉదయ్ కుమార్ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించానని పొంతనలేని సమాధానాలు ఇచ్చారని డీఎస్పీ సీబీఐ ముందు చెప్పినట్టుగా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను శనివారం అరెస్ట్ చేసిన సీబీఐ ఆయన కన్ఫెషన్ రిపోర్టు కూడా తీసుకుని ఉంటుంది. ప్రాథమింకంగా ఉదయ్ కుమార్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరెస్టుల పర్వం కొనసాగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు మాత్రం ఏపీలో సంచలనాలకు కేరాఫ్ గా మారింది. ఈ వ్యవహారంలో సీబీఐ మరింత దూకుడు పెంచి ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తుందోనన్నదే చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page