ఎంపీ అవినాష్ రెడ్డికి మరోమారు సీబీఐ నోటీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్​ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిపిన సీబీఐ.. తాజాగా మరోసారి విచారణ చేపట్టనున్నారు. ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.

రేపు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి పంపిన నోటీసుల్లో పేర్కొంది. శనివారం రాత్రి వైఎస్సార్​ జిల్లా పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు రాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి​ చెప్పారు. మరో తేదీ సూచించాలని కోరగా.. అధికారులు ససేమిరా అన్నారు. సోమవారం తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు.

మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోమారు నోటీసులు అందజేశారు. ఈ నెల 6వ తేదీన కడపలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో సూచించారు. భాస్కర్ రెడ్డికి ఇంతకుముందు జారీ చేసిన నోటీసులలో ఈ నెల 12న విచారణకు రావాలని కోరగా.. తాజా నోటీసుల్లో మాత్రం ఈ నెల 6న తప్పకుండా విచారణకు రావాలని సూచించారు. తండ్రి, కుమారులు ఇద్దరిని రేపు విచారించనుంది. అయితే సీబీఐ విచారణపై ఆసక్తి నెలకొంది.

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్​ రెడ్డి హస్తంపై సీబీఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు విచారించిన సీబీఐ.. రేపు మరోసారి విచారించనున్నారు. జనవరి 28న మొదటిసారి విచారించిన సీబీఐ.. పలు కీలక అంశాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 24న రెండోసారి ప్రశ్నించింది. ఇప్పటివరకూ.. తమ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా సిద్ధం చేసిన ప్రశ్నలను ఆయనపై సంధించింది.

You cannot copy content of this page