దిశ దశ, హైదరాబాద్:
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ తన నోటీసులో పేర్కొంది. అయితే కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నదే ప్రశ్నార్థకంగా మారింది.
గతంలో…
గతంలో కూడా సీబీఐ విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు అందాయి. అయితే తాను ఢిల్లీకి రాలేనని తన ఇంటికి వచ్చి విచారించాలని కవిత సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ఈ మేరకు మొదట సీబీఐ బృందం ఢిల్లీ నుండి హైదరాబాద్ కు వచ్చే క్రమంలోనే తనకు ఈ రోజు కుదరదని మెయిల్ చేయడంతో హైదరాబాద్ చేరుకున్న సీబీఐ టీం వెనుదిరిగిపోయింది. తిరిగి 2022 డిసెంబర్ 11న ఆమెను దాదాపు 7 గంటల పాటు విచారించారు. హైదరాబాద్ లోని కవిత ఇంట్లోనే సీబీఐ అధికారుల బృందాలు విచారణ జరిపాయి. ఆ తరువాత ఈ వ్యవహారంలో కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వలేదు. కానీ తాజాగా మరో సారి సీబీఐ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే మూడు సార్లు ఈడీ నుండి నోటీసులు అందుకున్న కవిత సుప్రీం కోర్టను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్న చర్చ ఓ వైపున సాగుతున్న క్రమంలోనే సీబీఐ రీ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. అయితే ఇప్పటికే తాను మహిళను అయినందున తన ఇంటివద్దే విచారించాలని సీబీఐని కోరిన కవిత, ఇదే అంశంపై ఈడీని ప్రతర్థిగా చేర్చి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో సీబీఐ విచారణకు ఆమె డిల్లీ వెల్తారా లేకపోతే విచారించేందుకు హైదరాబాద్ కే వచ్చి విచారణ చేయమంటారా అన్న విషయంపై కవిత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
అప్పుడలా…
అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో ఓ వైపున అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉండగా మరో వైపున విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్, సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయి. అయితే గత సంవత్సరం కూడా కవిత విషయంలో ఈడీ దూకుడుగా ప్రదర్శించడంతో పాటు ఈమె కూడా అటు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఈడీ విచారణకు హాజరయ్యారు. కోర్టులో వేసిన ఛార్జి షీట్ లో కవిత ఫోన్లను ద్వంసం చేశారని ఈడీ పేర్కొన్నప్పటికీ ఆమె మొబైల్ ఫోన్లను తీసుకెళ్లి ఈడీ అధికారులకు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఈడీ కార్యాలయాలనికి వెల్లినప్పుడు కూడా కవిత మొబైల్ ఫోన్లను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొబైల్ ఫోన్లపై సైంటిఫిక్ విచారణ చేశారా లేదా..? అన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. ఆ తరువాత ఢిల్లీ లిక్కర్ కేసు విషయంలో కవిత అంశం దాదాపు మరుగున పడినట్టే కనిపించినప్పటికీ అడపాదడపా ఆమె పేరు మాత్రం తెరపైకి వచ్చింది. ఈడీ విచారించినప్పుడయితే కవితను అరెస్ట్ చేస్తారన్న ఉత్కంఠత నెలకొనడంతో రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో డిల్లీకి వెల్లాయి. ఈ క్రమంలో ఈడీ విచారణ తరువాత కవితను బయటకు రావడంతో అరెస్ట్ పర్వానికి బ్రేకు పడినట్టేనని భావించారు. తాజాగా ఈ కేసులో సీబీఐ మరో సారి కవితకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.