సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవి విరమణ పొందిన తరువాత అవినీతి నిరోధక పరిధిలోకి రామన్న ధీమా వ్యక్తం చేస్తుంటారు చాలా మంది. బాధ్యతల్లో ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వారయితే అవినీతి నిరోధక శాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం అయితే సీబీఐ కరప్షన్ గురించి దాడులు చేసే అవకాశం ఉంటుందన్న నమ్మకంతో ఉంటుంటారు. అయితే తాజాగా ఒరిస్సాలోని భువనేశ్వర్ లో సీబీఐ అధికారులు జరిపిన దాడులు మాత్రం రిటైర్ అయిన అధికారులపై కూడా చేసే అధికారం ఉంటుందని తేల్చి చెప్తున్నాయి. పదవి విరమణ పొందినా అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని తేల్చి చెప్తోంది ఈఘటన. ఒరిస్సాలోని భువనేశ్వర్ లో రిటైర్ అయి నివాసం ఉంటున్న రిటైర్డ్ రైల్వే అధికారి ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్ గా పనిచేస్తూ గత నవంబర్ లో రిటైర్ అయిన ఆయన ఇంట్లో సోదాలు చేసిన సీబీఐ అధికారులు రూ. 157 కోట్ల నగదు, రూ. 8.5 కోట్ల విలువ చేసే 17 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్థుల కేసులో ఈ దాడులు చేసినట్టు అధికారులు తెలిపారు.