దిశ దశ, భూపాలపల్లి:
ముణ్ణాళ్ల ముచ్చటగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆ రెండు బ్యారేజీలను పునరుద్దరించే విషయంలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చేతులెత్తిసినట్టుగా తెలుస్తోంది. నిర్మాణ సమయంలో ఇఛ్చిన డిజైన్లకు నిర్మాణం జరిగిన తీరుకు పొంతన లేకుండా పోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీల్లో ఎదురైన సమస్యలను అధిగమించడం అసాధ్యంగా మారిపోయింది. అయితే ఇందుకు సంబంధించిన వ్యవహారలను చక్కబెట్టేందుకు కేంద్ర జలసంఘం కానీ ఐఐటీల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కూడా సీడీఓ సూచించడం గమనార్హం.
ఆ నైపుణ్యం లేదు…
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర బిందువుగా ఉండే మేడిగడ్డ, దానికి అనుసంధానంగా ఉన్న అన్నారం బ్యారేజీలను బాగు చేసేందుకు అవసరమైన నైపుణ్యం తమ వద్ద లేదని సీడీఓ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొంది, అత్యాధునికతను అందిపుచ్చుకుని ఇలాంటి అవాంతరాలను అధిగమించే సామర్థ్యం ఉన్న సంస్థలకు ఈ బాధ్యతలు అప్పగిస్తే బావుంటుదని కూడా సూచించడం గమనార్హం. కేంద్ర జలసంఘం కానీ ఐఐటీలకు చెందిన నిపుణుల ద్వారా కానీ బ్యారేజీల వైఫల్యాలకు సంబంధించిన అంశాలను లోతుగా అద్యయనం చేసి, డిజైన్ ను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని బాగు చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన డిజైన్లను అందించిన సీడీఓనే మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం సీ ఫేజ్ వంటి అంశాలను అధిగమించడంలో నిస్సహాయతను వ్యక్తం చేయడం సంచలనగా మారింది. వాటిని పునరుద్దరించేందుకు ఇతర సంస్థలకు ఆ బాధ్యతలు అప్పగించాలని తేల్చి చెప్పడాన్ని బట్టి చూస్తే వీటిని మరమ్మత్తులు చేసే విషయంలో సీడీఓ నిపుణులు కూడా చేతులెత్తేసినట్టయింది. నిర్మాణం చేపట్టేప్పుడు ఇచ్చిన డిజైన్లకు, బ్యారేజీల నిర్మాణాలకు పొంతన లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఏదైనీ బ్యారేజీల వద్దకు ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు వదిలి, వరద ఉధృతి తగ్గిన తరువాత ఎగువ ప్రాంతాల నుండి వచ్చే నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి నిలువ చేసే విధానం ఉంటుంది కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం బ్యారేజీలు నిండిపోయిన తరువాత దిగువకు నీటిని వదిలే విధానం అమలు చేశారని కూడా సీడీఓ అభిప్రాయపడింది. నిర్మాణ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు సీడీఓతో చేసిన సంప్రదింపులకు సంబంధించిన లేఖలను కూడా ఈ నివేదికతో అందించినట్టు సమాచారం. మోడల్ స్టడీస్ కు సంబంధించిన నివేదికలు అందకముందే నిర్మాణాలు జరిపారని కూడా సీడీఓ గుర్తించినట్టుగా తెలుస్తోంది.
ఉధృతి అంచనాల్లోనూ విఫలం…
మరో వైపున బ్యారేజీల నిర్మాణ ప్రాంతాల మీదుగా వచ్చే వరద ఉధృతి ఎంత వేగంగా ఉంటుంది..? అందుకు తగిన చర్యలు ఏ విధంగా ఉండాలి అన్న విషయాలపై కూడా అధ్యయనం చేయకుండానే అదుర్దాగా కట్టేశారా అన్న చర్చ మొదలైంది. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం బ్యారేజీ సీఫేజీ అంశాల తరువాత నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ మూడు బ్యారేజీలు ఒకే డిజైన్ లో ఉన్నాయని తన నివేదికలో స్పష్టం చేసింది. మూడు బ్యారేజీల నీటిని దిగువకు వదిలేసి నిర్మాణాల తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా ఎన్డీఎస్ఏ తేల్చిచెప్పింది. అయితే ఈ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరి రజత్ కుమార్ ఘాటుగా స్పందించారు. క్షేత్ర స్థాయిలో మొక్కుబడి పర్యటనలు చేపట్టి బ్యారేజీలు పనిచేయవని ఎలా చెప్తారన్నరీతిలో ఎదురు దాడికి దిగినంత పనిచేశారు. కేంద్ర జలశక్తి విభాగానికి చెందిన సలహాలు సూచలన మేరకు నిర్మించామని అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎలా అవుతాయంటూ ప్రశ్నిస్తూ సుదీర్ఘమైన లేఖ రాశారు. అయితే తాజాగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన తాజా నివేదిక నిర్మాణ సమయంలో జరిగిన విషయాలను ప్రస్తావించడం గమనార్హం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, సీడీఓకు మధ్య జరిగిన దాదాపు 25 లేఖలు కూడా జత చేసి పంపించడం విశేషం. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ, సీడీఓలు కూడా ఒకే అభిప్రాయం వ్యక్తం చేయడమే కాకుండా తమకు పంపిన డిజైన్లకు నిర్మాణాలకు పొంతన లేదని కుండ బద్దలు కొట్టినట్టుగా రిపోర్టు పంపడం చర్చనీయాంశం.