నివేదికల్లో అలా… ధరణిలో ఇలా… సీలింగ్ భూములకు ‘‘నాలా’’

దిశ దశ, కరీంనగర్:

సీలింగ్ పరిధిలో ఉన్న భూములంటూ రెవెన్యూ అధికారులు నివేదికల్లో స్పష్టం చేసినట్టుగా రికార్డులు చెప్తున్నాయి. అయినప్పటికీ అవే భూములకు ‘‘నాలా’’ ఎలా అమలయిందన్నదే ప్రశ్నార్థకంగా మారింది. చల్మెడ హస్పిటల్ ఆధీనంలో ఉన్న భూముల్లో సీలింగ్ చట్టం అమల్లో ఉన్న భూములు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూములకు ‘‘నాలా’’ కింద కన్వర్షన్ చేసేందుకు అనుమతులు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ 2008 వరకు అధికారులు మాత్రం ఇందుకు సమ్మతించనట్టుగా రికార్డులు చెప్తున్నాయి. అయితే ధరణీ పోర్టల్ లో మాత్రం అవే భూములకు బై నంబర్లు వేసి ‘‘నాలా’’ అమలయినట్టుగా ఉండడం విచిత్రంగా ఉంది.


ఎలా సాధ్యం..?

బొమ్మకల్ శివార్లలోని 113, 114, 115 సర్వేనంబర్లలోని భూమి సీలింగ్ యాక్టు పరిధిలో రెవెన్యూ అధికారులు తేల్చడంతో పాటు పంచనామా చేసినప్పుడు ధృవీకరించారు కూడా. 113లోని కొంత భూమి ఇతరుల ఆధీనంలో ఉండగా 114, 115 సర్వే నంబర్లలోని భూమి మాత్రం అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ ఆధీనంలోనే ఉన్నట్టుగా రికార్డులు చెప్తున్నాయి. అంతేకాకుండా అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ కూడా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు వివిధ సర్వే నంబర్లతో పాటు ఈ సర్వే నంబర్లకు కూడా ‘‘నాలా’’ అనుమతి ఇవ్వాలని కోరింది. సొసైటీ నిర్వాహకులు బై నంబర్లు ఉన్నాయని సదరు భూములకు నాలా కన్వర్షన్ చేయాలని మాత్రం దరకాస్తు చేసుకున్నట్టుగా రికార్డుల్లో లేకపోవడం మరో విశేషం. ధరణీలో మాత్రం బై నంబర్లు వేసి నాలా కన్వర్షన్ అయిందని ఓ సర్వే నంబర్ భూమికి, నోషనల్ ఖాతా… హౌజ్ సైట్స్ అని మరో సర్వే నంబర్ భూమికి, ఇంకో సర్వే నంబర్ లో ఇతరులు ఉన్నారన్న వివరాలను అప్ లోడ్ చేయడం విచిత్రంగా ఉంది. ధరణీ పోర్టల్ లో అప్ లోడ్ చేసినప్పుడు బై నంబర్లు ఎలా వచ్చాయన్నదే అంతు చిక్కకుండా పోతోంది. సీలింగ్ ట్రిబ్యూనల్ లో కేసు విచారణ దశలో ఉన్న ఈ భూముల వ్యవహారం గురించి పట్టాదారుల కుటుంబ సభ్యులు కూడాఅప్పీల్ చేసుకున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ధరణీ పోర్టల్ రికార్డులు ఎలా క్రియేట్ చేశారన్నది రెవెన్యూ అధికారులకే తెలియాల్సి ఉంది. సీలింగ్ ట్రిబ్యూనల్ లో నడుస్తున్న ఈ భూముల క్రయవిక్రయలే చట్ట విరుద్దం అయినప్పుడు ధరణీ పోర్టల్ కు వచ్చే సరికి బై నంటర్లు ఇవ్వడం వెనక ఉన్న ఆంత్యరం ఏంటన్నదే మిస్టరీగా మారింది. ధరణీ పోర్టల్ లో రెవెన్యూ భూముల వివరాలు నమోదు చేసేప్పుడు ఇష్టారీతిన వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుందా అన్న విషయంపై అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఒక వేళ సదరు సర్వే నంబర్ల భూమి క్రయ విక్రయాలు జరిపినట్టయితే అందులో కొంత వేరే పట్టాదారుల పేరు రావల్సి ఉంటుంది. కానీ బై నంబర్ల ద్వారా ధరణీ పోర్టల్ లో ఉన్న వివరాలు మాత్రం మొత్తం విస్తీర్ణానికి ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. సీలింగ్ పరిధిలో ఉన్నాయని రెవెన్యూ అధికారులే పలుమార్లు సర్టిఫై చేసిన తరువాత కూడా బై నంబర్ల ద్వార అదే భూమికి నాలా కన్వర్షన్ అయిందని, హౌజ్ సైట్స్ అని ధరణీ పోర్టల్ లో ఎలా అప్ లోడ్ చేశారన్న విషయంపై రెవెన్యూ అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. 1940వ దశాబ్దం నుండి కూడా పట్టాదారులకు సంబంధించిన వివరాలతో కూడిన రికార్డులు ట్రిబ్యూనల్ లో ఉన్నప్పటికీ అనూహ్యంగా ధరణీలో మాత్రం బై నంబర్ల వ్యవహారానికి ఎలా తెరలేపారోనన్నదే అంతుచిక్కకుడా పోతోంది.

నిర్లక్ష్యమేనా..?

అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ నిర్వహిస్తున్న చల్మెడ ఆసుపత్రి, కాలేజీ, పారా మెడికల్ కాలీజీలకు సంబంధంచిన భవనాలను నిర్మిస్తున్నప్పుడు రెవెన్యూ అధికారులు కానీ, పంచాయితీ యంత్రాంగం కానీ ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. బొమ్మకల్, దుర్శేడు శివార్లలోని పలు సర్వే నంబర్ల భూములను ‘‘నాలా’’ అనుమతుల కోసం దరకాస్తు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కేవలం పట్టా భూముల్లో నిర్మాణాలు జరుపుకోకుండా సీలింగ్ భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది. నిర్మాణాలు జరుగుతున్నప్పుడు పర్యవేక్షణ జరపి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడానికి కారణాలు ఏంటన్నదే మిస్టరీగా మారింది. మరో వైపున బొమ్మకల్ పంచాయితీ యంత్రాంగం కూడా నిర్మాణాల విషయంలో పట్టించుకోన వైఖరి అవలంభించిందన్న విమర్శలు లేకపోలేదు. భవనాల నిర్మాణాలు దరఖాస్తు చేసుకున్న విధంగానే జరుగుతున్నాయా లేదా అన్న విషయంపై దృష్టి సారించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపించినట్టయితే వాస్తవాలు బయట పడతాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అంటున్నారు. అధికార యంత్రాంగం ఇంత గుడ్డిగా ఎలా వ్యవహరించిందో అంతు చిక్కకుండా పోతోందని విస్మయం వ్యక్తం చేశారు. ఓ సారి తహసీల్దార్ ఓనర్ షిప్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారని, తమ పరిధిలో ఉన్న రికార్డులు పరిశీలించకుండానే ఇష్టారీతిన వ్యవహరించడం ఏంటన్ని ప్రశ్నించారు. రికార్డుల ట్యాంపరింగ్ సెక్షన్లలో బాధ్యులైన అధికార యంత్రాంగంపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బండారి శేఖర్ డిమాండ్ చేస్తున్నారు.

You cannot copy content of this page