తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు విచారణల చుట్టే తిరుగుతున్నట్టు ఉన్నయి. ఓ పార్టీ నేతకు ఎప్పుడు పిలుపొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. జాతీయ దర్యాప్తు సంస్థలు రాష్ట్ర నాయకులను విచారణకు రావాలని నోటీసులు పంపిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై కౌంటర్ అటాక్ చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను ప్రలోబాలకు గురి చేసే విషయంలో రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి బీజేపీ నేతలే టార్గెట్ గా దూకుడుగా వ్యవహరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల విచారణకు ప్రముఖులే హాజరవుతుండడంతో రాజకీయాలన్ని కూడా దర్యాప్తు సంస్థల వేదికగానే సాగుతున్నాయి.
అటు ఈడీ
లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ప్రారంభించిన కూపీ లాగే ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది. అలాగే చీకోటి ప్రవీణ్ విషయంలోనూ అంతా అయిపోయిందనుకున్న తరుణంలో కొత్తవారికి నోటీసులు జారీ చేయడంతో కేసు మరోసారి తెరపైకి వచ్చింది. చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో ఈడీ అధికారులు చేపట్టిన దర్యాప్తులో తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ ఎల్ రమణకు నోటీసులు ఇవ్వడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ సోదరులను విచారించిన ఈడీ అధికారులు ఆయన పీఏ హరీష్ కు నోటీసులు ఇచ్చారు. క్యాసినో పేరిట హవాలా చేశారన్న ఆరోపణల నేపథ్యంలో చీకోటి ప్రవీణ్ వ్యవహారంపై ఈడీ దృష్టి సారించింది. చీకోటిని ప్రశ్నిస్తున్న క్రమంలో ప్రముఖులు వారి సన్నిహితులు ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఇందుకు అనుగుణంగానే పలువురికి నోటీసులు ఇస్తుండడం, వారంతా విచారణకు హాజరవుతుండడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపున లిక్కర్ స్కాం విషయంలోనూ ఈడీ పలువురిని అరెస్ట్ చేయగా మరికొంతమందిని విచారించే పనిలో నిమగ్నం అయింది. ఢిల్లీ లిక్కర్ స్కాంతో రాష్ట్రానికి చెందిన పలువురితో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో ఈడీ విచారణ చేపట్టింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు బయటకు పొక్కినప్పటికీ ఇప్పటి వరకూ ఆమెకు ఎలాంటి నోటీసులు మాత్రం ఇవ్వలేదు. కానీ ఈ వ్యవహారంలో అభిషేక్ రావు, విజయ్ నాయకర్, అరబిందో గ్రూప్ డైరక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఫెర్నాడ్ రికార్డ్ కంపెనీ ప్రతినిధి బినోయ్ బాబులను అరెస్ట్ చేసిన ఈడీ అదికారులు కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు నోటీసులు పంపించగా, బాబిన్ డిస్టల్లరీస్ ఎండీ అరుణ్ రాంచద్ర పిళ్లైని మరోసారి విచారించేందుకు ఈడీ సమాయత్తం అవుతోంది. అరబిందో ఫార్మా కంపెనీ డైరక్టర్ శతర్ చంద్రారెడ్డి భార్య, జెట్ సెట్ గో ఏవియేషన్ సంస్థ వ్యవస్థాపకురాలు కనికా టెక్రివాల్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. అలాగే 2013కి సంబందించిన కరీంనగర్ జిల్లా గ్రానైట్ వ్యవహారంపై కూడా దాడులు చేసిన ఈడీ, ఐటీ టీమ్స్ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని కూడా సోదా చేశాయి. ఈ వ్యవహారంలో పలువురికి నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు గ్రానైట్ లావాదేవీల వెనక హవాలా ద్వారా డబ్బు రవాణా చేశారని గుర్తించారు. ఆయా గ్రానైట్ సంస్థల యజమానులు పనామా లీక్స్ లో పేరున్న చైనా వ్యాపారి ద్వారా ఈ లావాదేవీలు జరిపినట్టుగా గుర్తించారు. ఈ వ్యవహారంలో గ్రానైట్ సంస్థల్లో పని చేస్తున్న వారి అకౌంట్ల ద్వారా కూడా హావాల చేశారని భావిస్తున్న ఈడీ మరింత మందిని విచారించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఈ విచారణల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థల నుండి సుమారు 10 మంది ఎమ్మెల్యేలకు, వంద మంది ప్రముఖులకు నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపున లైగర్ సినిమా విషయంలో పూరీ జగన్నాథ్ ను కూడా విచారించిన ఈడీ అధికారులు గతంలో పబ్ ల కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ వ్యవహారంపై కూడా విచారణ జరిపింది. ఈ విచారణలో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈడీ ఎదుట హాజరు కావల్సి వచ్చింది.
సిట్ ఎఫెక్ట్…
మరో వైపున తెలంగాణాకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన వ్యవహారంపైనా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ వ్యవహారంలో పలు రాష్ట్రాల్లో సోదాలు చేపట్టిన సిట్ మరోసారి కూడా ఆయా రాష్ట్రాల్లో దాడులు చేస్తోంది. అంతేకాకుండా ఈ కేసులో మొయినాబాద్ ఫాం హౌజ్ లో పట్టుబడ్డ స్వామీజిలకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయడంతో పాటు వారితో చాలా సేపు మొబైల్ ఫోన్లలో మాట్లాడిన విషయాన్ని గుర్తించిన సిట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సన్నిహితుడని చెప్తున్న అడ్వకేట్ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చారు. సిట్ దర్యాప్తులో కూడా రానున్న కాలంలో మరింతమంది ప్రముఖులకు నోటీసులు జారీ అయ్యే అవాకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
అంతా వీఐపీలే
అటు జాతీయ దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల కేసుల్లో అంతా ప్రముఖులే ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారాల్లో ప్రముఖులే వెలుగులోకి వస్తుండడం గమనార్హం.