ప్రముఖులకూ శ్రీముఖాలు…

రాష్ట్రంలో వైవిద్యత

తెలంగాణ రాష్ట్రంలో వైవిద్యమైన పరిస్థితులు తయారయ్యాయి. ఇన్వెస్టిగేషన్ ఏజన్సీలు ప్రముఖులు లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇంతకాలం వీఐపీల జోలికి వెల్లని నిఘా సంస్థలు ఇప్పుడు వారికి కూడా నోటీసులు ఇస్తుండగా, మరో వైపున మహిళా కమిషన్లు కూడా చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించిన వారికి సమన్లు జారీ చేస్తున్నాయి. గతంలో ఒకరిద్దరు చట్ట సభల ప్రతినిధులపై కేసులు నమోదయినప్పటికీ ఇప్పుడు మాత్రం కీలక నేతలే టార్గెట్ గా నోటీసులు విడుదల అవుతుండడం గమనార్హం.

జాతీయ దర్యాప్తు సంస్థలు…

నకిలీ సీబీఐ అధికారి విషయంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు సీబీఐ నుండి సమన్స్ అందుకున్నారు. ఈ వ్యవహారంపై వీరిద్దరూ కూడా ఢిల్లీలో విచారణకు కూడా హాజరయ్యారు. కరీంనగర్ గ్రానైట్ వ్యవహారంలో ఈడీ టీమ్స్ రంగంలోకి దిగి మంత్రి గంగుల ఇంట్లోనూ సోదాలు నిర్వహించాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఓ సారి సీబీఐ హైదరాబాద్ లు విచారించారు. తాజాగా మూడు సార్లు ఈడీ కవితను విచారించగా మరోసారి పిలుస్తామని కూడా చెప్పారు.

మహిళా కమిషన్లూ…

ఓ వైపున జాతీయ మహిళా కమిషన్ మరో వైపున రాష్ట్ర మహిళా కమిషన్లు కూడా నేతలకు నోటీసులు జారీ చేశాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని జాతీయ మహిళా కమిషన్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి సమన్స్ పంపింది. దీంతో ఆయన ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరు అయి వివరణ ఇచ్చుకున్నారు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో బండి సంజయ్ కూడా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చుకున్నారు.

ఇప్పుడు సిట్…

రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో ప్రత్యేకంగా వేసిన సిట్ పర్వం నడుస్తోంది. పేపర్ల లీకేజీ వ్యవహారంలో మీడియా ముందు ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు నోటీసులు జారీ చేసింది సిట్. రేవంత్ రెడ్డి గురువారం సిట్ ముందు హాజరు కాగా నేడు బీజేపీ చీఫ్ బండి సంజయ్ హాజరు కావల్సి ఉంది. ఇలా ప్రముఖులే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు, కమిషన్లు సమన్స్ జారీ చేస్తుండడంతో రాష్టంలో సరికొత్త వాతావరణం ఏర్పడింది. తెలంగాణలో ముఖ్య నాయకులకు నోటీసులు ఇచ్చే పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయన్న చర్చలు కూడా సాగుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థల నుండి ఆయా పార్టీల ముఖ్యులు నోటీసులు అందుకుంటుండడం విశేషం.

You cannot copy content of this page