దిశ దశ, హైదరాబాద్:
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దండకారణ్యంలోని సౌత్ సబ్ డివిజనల్ బ్యూరోలో కేంద్ర కమిటీ సభ్యురాలి హోదాలో పనిచేస్తున్న పద్మ అలియాస్ కల్పన అలియాస్ సుజాతక్క అలియాస్ మైన్‌బాయి అలియాస్ ఝాన్సీ బాయి(60)ని నిఘా వర్గాలు ట్రేస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆమె భర్త మలోఝ్జుల కోటేశ్వర్‌రావు కూడా కేంద్ర కమిటీ సభ్యనిగా పని చేస్తున్నప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన కోటేశ్వరరావు సోదరుడు వేణుగోపాల్ అజ్ఞాతంలో ఉన్నారు. కిషన్ జీ భార్య సుజాతక్క కూడా నేటికీ పార్టీ కార్యకలాపాల్లోనే కొనసాగుతున్నారు. అయితే చత్తీస్ గడ్ లోని సౌత్ బస్తర్ అటవీ ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో ఉన్న ఆమె బయటకు ఎందుకు వచ్చారోనన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. వైద్య పరీక్షల కోసం ఆమె మహబూబ్ నగర్ వచ్చారా లేక షెల్టర్ జోన్ లో ఉంటున్నారా అనేది కూడా తెలియరావడం లేదు. సూజాతక్క క్రాంతికారీ జనతన్ సర్కారు వ్యవహారాల్లోనూ కీలక బాధ్యతల్లో ఉన్నట్టు సమాచారం.