దిశ దశ. దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ మిలటరీ కమిషన్ లో అత్యంత కీలకమైన నేత హిడ్మా. దండకారణ్యంలో బలగాలను మట్టుబెట్టడంలో హిడ్మా ఆపరేషన్లే అత్యంత కీలకం. కవ్వింపు చర్యలకు పాల్పడి మరీ కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలను హతమార్చడంలో ఆయన భూమిక అత్యంత కీలకంగా ఉంటుంది. 2010లో కేంద్ర రిజర్వూ బలగాలు ప్రయాణిస్తున్న మైన్ ప్రూఫ్ వాహనాన్ని పేల్చి 76 మందిని చంపిన ఘటనతో వెలుగులోకి వచ్చిన హిడ్మా మావోయిస్టు పార్టీకి కుడి భుజం వంటి వాడనే చెప్పాలి. క్రాంతీ కారీ జనతన్ సర్కార్ ఏర్పాటు తరువాత మావోయిస్టు పార్టీకి దండకారణ్య ఆదివాసీలు పెద్ద ఎత్తున ఆదరించారు. వారిలో అత్యంత కీలకమైన వారిలో మొదటి పేరు హిడ్మా అనే వినిపిస్తోంది. దాదాపు నాలుగేళ్ల క్రితం తన సొంత గ్రామమైన పువ్వర్తి, జీనగూడ కీకారణ్యంలో కూంబింగ్ చేపట్టిన బలగాలను చుట్టుముట్టి 26 మందిని హతమార్చిన ఘటన కూడా హిడ్మా నేతృత్వంలోనే జరిగింది. ఈ సమయంలో ఓ జవాన్ ను కిడ్నాప్ చేసి ప్రజా కోర్టులో ప్రవేశ పెట్టగా స్థానిక జర్నలిస్టులు చొరవ తీసుకోవడంతో అతన్ని ప్రాణాలతో వదిలారు. బస్తర్ పూర్వ జిల్లాలో అయినా… మాడ్ ఏరియాలో అయినా కూడా ఎలాంటి ఆపరేషన్ చేపట్టినా సక్సెస్ చేయడంలో ఆయనది కీలక పాత్ర. మావోయిస్టు పార్టీ బాల సంఘంలో జాయిన్ అయి అత్యంత ముఖ్యమైన నాయకుడిగా ఎదిగిపోయాడు. అయితే కొంతకాలంగా ఆయన పార్టీ దాడులకు పూనుకున్న ఘటనల్లో మాత్రం హిడ్మా పేరు వినపించడం లేదు. ఇటీవల కుల్హారీ ఘట్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిషా ఇంఛార్జి రామచంద్రా రెడ్డి అలియాస్ చలపతి మరణించడంతో మరోసారి హిడ్మా పేరు తెరపైకి వచ్చింది.
పార్టీ పక్కన పెట్టిందా..?
చలపతి ఎన్ కౌంటర్ తరువాత రక్షణ చర్యలు తీసుకోవడంలో హిడ్మా వైఫల్యం చెందాడని, కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న ఆయనను బాధ్యతల నుండి తప్పించారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. చత్తీస్ గడ్, ఏపీ, తెలంగాణల్లో హాట్ టాపిక్ గా మారడంతో మరోసారి ఆయన చర్చల్లో నిలిచాడు. ఒడిషా, చత్తీస్ గడ్ సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ విషయంలో హిడ్మా సరైన వ్యూహం రచించలేకపోయాడని, ఈ కారణంగానే చలపతి లాంటి అత్యంత కీలకమైన నేతను పార్టీ పొగొట్టుకోవల్సి వచ్చిందన్న వాదనలు తెరపైకి వచ్చాయి. కేంద్ర కమిటీ ఈ విషయంలో హిడ్మాను దోషిగా ప్రకటించి ఆయనను బాధ్యతల నుండి తప్పించిందని, కేంద్ర కమిటీలో ఆయన స్థానాన్ని పక్కన పెట్టేశారన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.
నిజమేనా..?
అయితే కేంద్ర మిలటరీ కమిషన్ ఇంఛార్జిగా ఉన్న హిడ్మాకు సెంట్రల్ కమిటీలో ఎలాంటి బాధ్యతలు ఇంకా అప్పగించలేదని తెలుస్తోంది. ఆయన కేంద్ర కమిటీ కనుసన్నల్లో వ్యూహ రచన చేసి బలగాలపై పై చేయి సాధించేందుకు అవసరమైన ఆపరేషన్లు నిర్వహించే బాధ్యతలు మాత్రమే ఆయనకు అప్పగించినట్టుగా సమాచారం. అంతేకానీ కేంద్ర కమిటీలో ఆయనకు బాధ్యతలు అప్పగించనట్టుగా సమాచారం.
ఇంఛార్జిగా ఆయనేనా…
అయితే హిడ్మా స్థానాన్ని భర్తీ చేసేందుకు దేవ్ కు కేంద్ర కమిటీ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. హిడ్మా వారసుడిగా ఉన్న దేవ్ ఆవపల్లి బ్లాస్టింగ్ కు, బలగాలపై దాడులు చేయడం వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అయితే హిడ్మా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం ఆయనను రహస్య ప్రాంతంలో షెల్టర్ తీసుకోవాలని సీసీ కమిటీ సూచించించినట్టుగా తెలుస్తోంది. గతంలోనే హిడ్మా అనారోగ్య సమస్యల గురించి వెలుగులోకి వచ్చినప్పటికీ పార్టీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. దీంతో హిడ్మా కీలకమైన ఆపరేషన్లలోనే పాల్గొంటున్నాడన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్నాడన్న సమాచారం మేరకు బలగాలు కూడా ఆయన లక్ష్యంగా ఆపరేషన్లకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మాత్రం బలగాల చేతికి చిక్కకపోగా ఆ ఘటన నుండి తప్పించుకున్నాడన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అనారోగ్య సమస్యలతో హిడ్మా ప్రస్తుతం పార్టీ లక్ష్యాలను ఛేదించే బాధ్యతలకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా తెలిసింది. అయితే జీనగూడ ఘటనతో బలగాలు కేంద్ర కమిటీ సభ్యులకంటే హై టార్గెట్ లిస్టులో హిడ్మాను చేర్చినట్టుగా పార్టీ నాయకత్వానికి కూడా సమాచారం అందింది. దీంతో ఆయన బలగాలకు చిక్కినట్టయితే మంచిది కాదన్న ఆలోచనతో పాటు ఆయనను అనారోగ్య సమస్యలు వెంటాడుతుండడంతో దాదాపు రెండు మూడేళ్లుగా అండర్ గ్రౌండ్ లో ఉంచినట్టుగా తెలుస్తోంది. ఒక వేళ అయన పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ రోల్ పోషించినా పార్టీ పెట్టుకున్న ప్రదాన లక్ష్యాలను ఛేదించడం వరకే పరిమితం అయ్యే వాడు కానీ రక్షణ చర్యలకు ఆయనకు సంబంధమే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.